Death : చావు దగ్గర పడిందని మనిషికి ముందే తెలుస్తుందా.. ఆ 3 అంతుచిక్కని రహస్యాలేంటి?
Death : చాలా మందికి తాము చనిపోబోతున్నాం అనే విషయం కొన్ని రోజుల ముందే తెలుస్తుందనేది ఒక పెద్ద నిజం
Death
మనిషి జీవితంలో పుట్టడం ఎంత సహజమో.. చావు(Death) కూడా అంతే నిజం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందేననే.. నిజాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ చనిపోయే కొద్ది రోజుల ముందు మనుషుల్లో కనిపించే కొన్ని ఆశ్చర్యకరమైన మార్పుల వెనుకున్న మిస్టరీని మాత్రం ఇప్పటికీ ఎవరూ కూడా పూర్తిగా విప్పలేకపోతున్నారు.
ఎన్నో ఏళ్లుగా మంచానికి మాత్రం పరిమితమై కనీసం తన కట్టుకున్న భార్యను గానీ, కన్నపిల్లలను గానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి.. అకస్మాత్తుగా చనిపోయే కొన్ని గంటల ముందు మంచం మీద నుంచి లేచి కూర్చుని.. అందరితో చాలా మాట్లాడటం మన చుట్టూ చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం.
అలాగే ఎవరితో కూడా కలవకుండా ఒంటరి జీవితం గడిపిన వ్యక్తి కూడా, చివరి క్షణాల్లో ఎప్పుడూ లేనంత ఆప్యాయంగా అందరినీ దగ్గరకు పిలిచి మాట్లాడుతుంటారు. అసలు చావు(Death)కు ముందు మనుషులు అలా ఎందుకు మారిపోతారనే విషయంపై.. సైన్స్, సైకాలజీ , ఆధ్యాత్మికంలో వివిధ కారణాలున్నాయి.
ఇలా చివరి క్షణాల్లో హఠాత్తుగా వచ్చే మార్పును వైద్య ప్రపంచంలో టెర్మినల్ లూసిడిటీ అని పిలుస్తారు. అంటే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల వల్ల మెదడు కణాలు పూర్తిగా దెబ్బతిని.. కోమా స్థితికి చేరుకున్నవారు కూడా మరణానికి కొద్దిసేపటి ముందు ఎంతో యాక్టివ్‌గా మారిపోతారు.
కొన్నేళ్ల క్రితం జరిగిన పాత జ్ఞాపకాలను, చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న వ్యక్తిలో జరిగే ఈ అద్భుతాన్ని చూసి.. ఇంట్లో వాళ్లంతా ఆ వ్యక్తి కోలుకుంటున్నాడేమో అని సంబరపడేలోపే వారు కన్నుమూస్తారు.
అయితే దీనికి పక్కా శాస్త్రీయ వివరణను ఇవ్వడానికి సైన్స్ కూడా ఇప్పటికీ తల పట్టుకుంటోంది. చనిపోయే ముందు శరీరం తన చివరి పోరాటంగా కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు, రసాయనాలను ఒకేసారి రిలీజ్ చేయడం వల్లే.. మెదడు క్షణకాలం పాటు అలా వెలుగుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఇంకొంతమంది చనిపోయిన బంధువులు తమ కళ్ల ముందు కనిపిస్తున్నారని చెప్పడం వెనుక కూడా సైన్స్ ఒక రీజన్ చెబుతుంది. చావు(Death) దగ్గర పడుతున్నప్పుడు గుండె వేగం తగ్గి, మైండ్‌కు ఆక్సిజన్ అందడం చాలా తగ్గిపోతుందని.. దానివల్ల వచ్చే భ్రాంతుల వల్లే అలా చనిపోయిన వారంతా వారికి కనిపిస్తున్నట్లు అనిపిస్తుందని డాక్టర్లు అంటున్నారు.
కానీ ఆధ్యాత్మిక కోణం మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా వేరేలా చూస్తుంది. ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లే సమయం దగ్గరపడినపుడు ..ఆత్మకు ఈ భూమితో ఉన్న బంధం తెగిపోయి పరలోకానికి సంబంధించిన కొన్ని పవర్స్‌ను గ్రహించే దివ్యదృష్టి లభిస్తుంది.
ఆ శక్తి వల్లే వారు అప్పటికే చనిపోయిన తమ దగ్గరి వారు వచ్చినట్లుగా భావించి..అదిగో వాళ్లు నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు, నేను వెళ్తున్నానని చేతులు ఊపుతూ నవ్వుతూ ప్రాణాలు వదిలేస్తుంటారు.
అలాగే జీవితమంతా ఎంతో కోపంగా, ఆస్తి గొడవలతో,అహంకారంతో అందరినీ దూరం పెట్టిన వాళ్లు కూడా చివరి రోజుల్లో చాలా ప్రశాంతతను ప్రదర్శిస్తారు. సైకాలజిస్టులు చెబుతున్నదాని ప్రకారం.. ఇక జీవిత పోరాటం ముగిసిపోతోందని, తాను సంపాదించినదేదీ తనతో రాదని మనసుకు ఒక స్పష్టత రాగానే, మనిషి ఒక రకమైన సరెండర్ సిట్యువేషన్‌కి చేరుకుంటాడు.
అప్పటివరకు తనలో ఉండే ఈర్ష్యాద్వేషాలు ఎంత చవకబారువో అతనికి అర్థమవుతుంది. అందుకే ఎన్నో ఏళ్లుగా మాట్లాడని సొంత తమ్ముడినో, అక్కనో పిలిపించుకుని, వారి చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్తారు. చివరి క్షణాల్లో మనసులోని పగ, కోపం అనే భారాన్ని దించుకుని ప్రశాంతంగా చనిపోవాలనే ఒక లోతైన మానసిక పరిస్థితే దీనికి కారణం.
చాలా మందికి తాము చనిపోబోతున్నాం అనే విషయం కొన్ని రోజుల ముందే తెలుస్తుందనేది ఒక పెద్ద నిజం. కొంతమంది తాము చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, కొన్ని గంటల ముందు తమకు ఇష్టమైన ఉంగరాన్నో, వాచీనో మనవడికో మనవరాలికో తీసి ఇచ్చేయడం, బ్యాంకు అకౌంట్ వివరాలు భార్యకు అప్పగించడం వంటివి చేయడం చూస్తుంటాం.

బాడీ లోపల అవయవాలన్నీ ఒక్కొక్కటిగా అలసిపోతున్నప్పుడు, ప్రాణం పోయే టైమ్ దగ్గరపడిందనే సంకేతాలను మనసు ముందే పసిగడుతుందని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు.
అందుకే జీవితం ముగిసిపోయే ఆఖరి నిమిషంలో ఈ నిజాన్ని తెలుసుకుని బాధ పడేకంటే..మన చేతిలో సమయం ఉన్నప్పుడే ఇతరులను ప్రేమించడం, కక్షలు వదిలేసి క్షమించడం నేర్చుకోవాలి.
ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికాం, ఎన్ని ఆస్తులు సంపాదించామనేదాని కంటే.. మన వల్ల ఎంతమంది ముఖాల్లో నవ్వులు విరిసాయి, మనల్ని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారనేదే మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తుంది.
Netanyahu : ట్రంప్ డీల్‌పై ఇజ్రాయిల్ గరంగరం.. ఇరాన్‌ను వదలనంటున్న నెతన్యాహు





