Couple:వివాహ బంధంలో మమకారం మసకబారుతుందా? దీని కోసం ఏం చేయాలి?
Couple: ప్రేమికులే కాదు, భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడూ ఐ లవ్యూ చెప్పుకోవాలి. అలాగే అవసరం అయినపుడు థ్యాంక్యూ, సారీ వంటివి చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి.
Couple
ఈ రోజుల్లో చాలామంది దంపతులు(Couple )చిన్న చిన్న కారణాలతోనే దూరమవుతున్నారు. ప్రతి విషయానికి అలకలు, కోపాలు, అపార్థాలు పెంచుకుంటూ దూరాలు పెంచుకుంటున్నారు. దీనివల్ల వైవాహిక బంధంలో ఆత్మీయత తగ్గిపోయి నూరేళ్లు సంతోషంగా ఉండాల్సిన వాళ్లంతా కొద్ది కాలానికే విడిపోతున్నారు. లేదా తెలియని గ్యాప్‌తో దూరదూరంగా ఉంటున్నారు. అలా కాకుండా చివరి వరకూ సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు తప్పకుండా గౌరవించుకోవాలి.
భార్యాభర్తలంటే కేవలం ప్రేమను, సంతోషాలను పంచుకోవడం మాత్రమే కాదు. ఒకరి అభిరుచులను మరొకరు అర్థం చేసుకోవడం,ఒకరి ఆలోచనలను ఇంకొకరు గౌరవించడం, అన్ని విషయాల్లో సపోర్టుగా ఉండటం, కష్టాల్లో అండగా నిలబడడం ముఖ్యం. వీటికి కాస్త సరదాను కూడా జోడిస్తే వారిద్దరి బంధం మధురంగా మారుతుంది.
అందుకే ప్రేమికులే కాదు, భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడూ ఐ లవ్యూ చెప్పుకోవాలి. అలాగే అవసరం అయినపుడు థ్యాంక్యూ, సారీ వంటివి చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఐ లవ్యూ చెబితే బోర్ కొడుతుంది అనుకుంటే విభిన్న రీతుల్లో తమ ప్రేమను వ్యక్తపరచాలి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల వంటి సందర్భాల్లో భాగస్వామికి నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉండాలి.
అలాగే ఒక చిన్న చిరునవ్వు లైఫ్‌లోని బాధలన్నింటిని కూడా మరిపిస్తుంది. దంపతులు ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన గొడవలను , గతాన్ని తవ్వుకునే కంటే.. నవ్వు తెప్పించే ముచ్చట్లను రీ కలెక్ట్ చేసి ముచ్చటించుకోవాలి. మార్నింగ్ లేదా ఈవెనింగ్ వాక్కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం, రోజులో కాసేపు అయినా సరదాగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కలిసి సినిమాలు చూడటం కూడా మంచి అలవాటే.
రోజూ పనులతో బిజీగా ఉన్నా కూడా, సెలవు రోజుల్లో ఒకరికొకరు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా తయారు కావాలి. ఆ సమయంలో మీ భాగస్వామి గురించి మీకు కలిగిన మంచి ఫీలింగ్‌ను మనసులో దాచుకోకుండా వారితో పంచుకోవాలి. దీనివల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
దంపతుల(Couple) మధ్య ఏదైనా అసంతృప్తి ఏర్పడినప్పుడు దానిని లోలోపల దాచుకోకుండా చర్చించుకోవాలి. భాగస్వామి గురించి నచ్చని విషయం గురించి వారితో మాత్రమే చర్చించాలి. కానీ కొంతమంది భార్యకు, భర్తకు చెప్పకుండా చుట్టాల ముందు తమ గొడవల గురించి బయటపెట్టుకుంటారు.

అలాగే మరికొంతమంది తమ ఇద్దరి మధ్యకు పేరెంట్స్‌ను కూడా లాగుతారు. లేదా పేరెంట్సే తమ పిల్లల గొడవల్లో తల దూర్చుతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. వారిద్దరూ కలిసి చర్చించుకుంటేనే సగం గొడవలు అక్కడే ఫుల్ స్టాప్ పడతాయన్న విషయాన్ని ఎవరూ మర్చి పోకూడదు.
అంతేకాదు అప్పుడప్పుడూ తప్పులు చేసినపుడు భాగస్వామిని క్షమించమని అడుగుతూ సారీ చెప్పడం, అలాగే భాగస్వామి తనకు చేసే పనులను మెచ్చుకుంటూ థ్యాంక్యూ చెప్పడం వల్ల వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
Kolkata: లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ ..ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్





