Just LifestyleLatest News

Relationship : బంధంలో ప్రేమ మాత్రమే సరిపోదు.. సైకాలజీ చెప్పే రిలేషన్‌షిప్ సూత్రాలు

Relationship : ఏ బంధంలోనైనా గొడవలు జరగడం సహజం. అలా గొడవ జరిగినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. కానీ అలా చేయకుండా రోజుల తరబడి మౌనంతో అవతలి వ్యక్తిని శిక్షించడం అత్యంత ప్రమాదకరమైన అలవాటు.

Relationship

ప్రేమ, నమ్మకం అనే పునాదులపై ఏర్పడే ఏ రిలేషన్‌షిప్ అయినా జీవితాంతం నిలబడాలంటే పార్ట్‌నర్స్ మధ్య ప్రవర్తన, ఆలోచనలే కీలకం. అందుకే సైకాలజీ ప్రకారం ఒక ఆరోగ్యకరమైన బంధంలో పార్ట్‌నర్స్ మధ్య కచ్చితంగా ఉండకూడని అలవాట్లు, అలాగే ఉండాల్సిన అమూల్యమైన లక్షణాల గురించి అందరూ తెలుసుకోవాలి.

ఏ బంధంలో(Relationship)నైనా గొడవలు జరగడం సహజం. అలా గొడవ జరిగినప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. కానీ అలా చేయకుండా రోజుల తరబడి మౌనంతో అవతలి వ్యక్తిని శిక్షించడం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. సైకాలజీలో దీనిని స్టోన్‌వాలింగ్ అంటారు. సమస్యల కంటే ఈ నిశ్శబ్దమే ఇద్దరి మధ్య గ్యాప్‌ను మరింత పెంచుతుంది. మీ మనసులోని బాధను అయినా, కోపాన్ని అయినా సరే మాటల్లో చెప్పనంత కాలం అవతలి వ్యక్తికి అర్థం కాదు.

ప్రేమ పేరుతో బందీని చేయడం, అనుమానించడం చేయకూడదు. చాలామంది ప్రేమ ఎక్కువగా ఉండటం వల్లే ఇలా చేస్తున్నామని చెబుతుంటారు. కానీ పార్ట్‌నర్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారంటూ 24/7 నిఘా పెట్టడం ప్రేమే కాదు. ఒకరి పర్సనల్‌ ఫ్రీడమ్‌ను పూర్తిగా లాగేసుకుని, వారి ఫోన్లను తనిఖీ చేయడం, ఆ బంధాన్ని నరకంలా మారుస్తుంది. అతిగా కంట్రోల్ చేయాలని చూస్తే ఎంతటి గాఢమైన ప్రేమ అయినా ఊపిరాడక చచ్చిపోతుంది.

ఎప్పుడు కూడా గతాన్ని తవ్వి తీయడం ,తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేయకూడదు. ప్రస్తుతం జరిగే చిన్న తప్పుతో.. ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన విషయాలను లింక్ చేసి ఎత్తిపొడవడం వల్ల బంధంలో పగుళ్లు వస్తాయి. అందరి ముందు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ వారి సంపాదనను, రూపాన్ని, తెలివితేటలను వేరే వాళ్లతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల వారి సెల్ఫ్‌ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఒకసారి అవతలి వారి మనసు గాయపడితే, ఆ స్థానంలో మళ్లీ ఆ పాత ప్రేమను తీసుకురావడం ఎవరికీ కూడా సాధ్యం కాదు.

అలాగే ఒక బంధాని(Relationship)కి నమ్మకం ప్రాణం వంటిదని గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఆ గాయం బంధంలో ఎప్పటికీ ఒక మచ్చలానే మిగిలిపోతుంది. కెరీర్, డబ్బు విషయాల్లోనే కాదు.. మన స్నేహితుల సర్కిల్ గురించి, మనకున్న అలవాట్ల గురించి కూడా పార్ట్‌నర్‌ దగ్గర ఓపెన్‌గా ఉండాలి. చాలామంది ఈ విషయం చెబితే గొడవవుతుంది కదా అని నిజాలను దాచిపెడుతుంటారు. కానీ అది రేపు బయటపడినప్పుడు.. ఇంత చిన్న విషయమే దాచారంటే, పెద్ద విషయాల్లో ఇంకెంత దాచారో అని పార్ట్‌నర్ మనసులో అనుమానం బీజం మొలకెత్తడానికి కారణం అవుతుంది.

Relationship
Relationship

అంతేకాదు నిజమైన ప్రేమ అంటే భాగస్వామిని మనకు నచ్చినట్లుగా వారిని మార్చుకోవడం కాదన్న విషయాన్ని అంగీకరించాలి. అలాగే వారిని మార్చడం కుదరకపోతే వారిలోని లోపాలతో సహా వారిని ఉన్నది ఉన్నట్లుగా గుండెలకు హత్తుకోవాలి. ఒకరి ఆలోచనలకు, నిర్ణయాలకు మరొకరు తప్పకుండా విలువ ఇవ్వాలి. నువ్వు సంపాదించేది ఎంత, నేను చేసేది ఎంత అనే ఈగోలు పక్కన పెట్టి, ఇద్దరూ సమానమే అనే గౌరవం ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది.

ఇక ప్రపంచమంతా అవతలివారిని తప్పుబడుతున్నా, వారి పార్ట్‌నర్ దగ్గరికి వెళ్లి తల వాల్చినప్పుడు వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం ప్రతి ఒక్కరికీ కలగాలి. వారు తన బాధను లేదా ఆవేదనను పంచుకుంటున్నప్పుడు మధ్యలో తప్పులు వెతకకుండా, ఎలాంటి జడ్జ్‌మెంట్స్ ఇవ్వకుండా ఓపికగా వినాలి. ఆ సమయంలో పార్ట్‌నర్ నుంచి వచ్చే చిన్న ఓదార్పు, భరోసా వంద మాటల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి.

Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Related Articles

Back to top button