Old Age People : 60 దాటిన వాళ్లు తినేటపుడు, తాగేటప్పుడు పాటించాల్సిన రూల్స్..చిన్న విషయాలే అని లైట్ తీసుకోవద్దు..
Old Age People : వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల 60 ప్లస్ వయసు వాళ్లు ముఖ్యంగా రెండు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
Old Age People
రాత్రి పడుకునేముందు దాహం వేయడం, నీళ్లు తాగడం ఎవరికైనా అలవాటే. అయితే అలా నీళ్లు తాగిన ఓ వృద్ధుడి మరణం ఇప్పుడు ఎంతోమందికి గుణపాఠంగా మారింది. అతను నీళ్లు తాగుతుండగా అనుకోకుండా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో గొంతుకు అడ్డం పడి శ్వాస ఆడలేదు. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించినా కూడా పరిస్థితి విషమించి ఆయన మరణించారు. ఈ ఘటన వయసు పైబడిన వారు ప్రతి చిన్న విషయంలో ఎంత అలర్ట్‌గా ఉండాలో స్పష్టం చేస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల 60 ప్లస్ వయసు వాళ్లు ముఖ్యంగా రెండు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మొదటిది కింద పడకుండా జాగ్రత్తగా నడవడం, రెండోది తినేటప్పుడు లేదా తాగేటప్పుడు పొలమారే పరిస్థితి రాకుండా చేసుకోవడం.
60 ఏళ్లు దాటిన తర్వాత ఫుడ్, వాటర్‌ను మింగడానికి ఉపయోగపడే గొంతు కండరాలు బాగా వీక్ అవుతాయి. అందువల్ల నీళ్లు తాగే సమయంలో ఏకాగ్రత వేరే విషయాల వైపు మళ్లించకుండా, పూర్తి శ్రద్ధతో నెమ్మదిగా నీళ్లు తాగడాన్ని అలవాటుగా చేసుకోవాలి. వృద్ధుల్లో లిక్విడ్స్ శ్వాసనాళంలోకి వెళ్లడం వల్ల ఆస్పిరేషన్ న్యుమోనియా అనే చాలా డేంజరస్ అయిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో ఉండే పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. వృద్ధులు నీళ్లు లేదా ఇతర ద్రవాలను తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించాలి.ఎలాంటి పరిస్థితులలో అయినా కూర్చొనే నీళ్లు తాగాలి. అలాగే నీళ్లు తాగే సమయంలో తలను కొద్దిగా క్రిందికి వంచి నీటిని మింగడం వల్ల నీళ్లు డైరెక్టుగా ఆహారవాహికలోకి వెళ్తాయి.

అంతేకాకుండా నోట్లో ఆహారం నములుతున్న సమయంలో ద్రవపదార్థాలు తాగకూడదు. ఆహారం, నీరు రెండూ నోటిలో ఒకేసారి ఉన్నప్పుడు తెలీకుండానే ద్రవాలు శ్వాసనాళం వైపు వెళ్తాయి. తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు మాట్లాడటం, పక్కకు తల తిప్పడం వంటివి చేయకూడదు.
వృద్ధులకు ఫిజికల్ ఎబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఏదైనా గొంతుకు అడ్డం పడి దగ్గడానికి ప్రయత్నించినప్పుడు విపరీతమైన ఒత్తిడి వల్ల ముఖం ఎర్రబడటం, బీపీ అకస్మాత్తుగా పెరగడం వంటివి జరిగి ప్రాణాపాయం సంభవిస్తుంది.





