Physical Intimacy: పెళ్లి, లివ్-ఇన్ రిలేషన్లో ఫిజికల్ ఇంటిమసీ ఎందుకు ముఖ్యం?బంధాల వెనుక అసలు బంధం అదేనా?
Physical Intimacy: గొడవలు జరిగినప్పుడు, మెంటల్ టెన్షన్లో ఉన్నప్పుడు, పార్టనర్ ఇచ్చే ఒక చిన్న టచ్ , దగ్గర తనం ఆ ఒత్తిడిని తగ్గించి, బంధాన్ని తిరిగి గాడిలో పెడుతుందని సైకాలజీ చెబుతోంది.
Physical Intimacy
పెళ్లి, లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఆ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం ఎంత ముఖ్యమో.. శారీరక సాన్నిహిత్యం కూడా అంతే ముఖ్యమైనదని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, పూర్తిగా దగ్గరవడానికి శారీరక సాన్నిహిత్యం(Physical Intimacy) అనేది ఒక పవర్ ఫుల్ మీడియేటర్‌గా పనిచేస్తుందట.
చాలామంది దీనిని కేవలం ఒక శారీరక అవసరంగానో, టెంపరరీ ఆనందంగా మాత్రమే చూస్తారు. కానీ, సైకాలజీతో పాటు జీవశాస్త్రం చెబుతున్నదాని ప్రకారం, ఒక ఆరోగ్యకరమైన బంధం కొనసాగడానికి ఇది చాలా అవసరమని చెప్పడానికి చాలా లోతైన కారణాలున్నాయి. ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, ఇద్దరి మనసులను, రెండు జీవితాలను కలిపే ఒక అదృశ్య వంతెన వంటిదని ఇవి చెబుతాయి
శారీరక సాన్నిహిత్యం (Physical Intimacy)వల్ల కలిగే మెయిన్ బెనిఫిట్.. ఎమోషనల్ బాండింగ్ (Emotional Bonding). ఒక బంధంలో ఉన్న ఇద్దరు శారీరకంగా దగ్గరైనప్పుడు వారి మెదడులో ఆక్సిటోసిన్ (Oxytocin) అనే హార్మోన్ రిలీజవుతుంది. దీనిని లవ్ హార్మోన్ లేదా కౌగిలింత హార్మోన్ అని కూడా పిలుస్తారట. ఇది భాగస్వాముల మధ్య నమ్మకాన్ని, భద్రతా భావాన్ని మరింత పెంచుతుంది.
ఒకరిపై ఒకరికి ఉన్న అనురాగాన్ని మాటల్లో చెప్పలేని సమయంలో, ఈ సాన్నిహిత్యం ద్వారా ఆ ప్రేమ వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గొడవలు జరిగినప్పుడు, మెంటల్ టెన్షన్లో ఉన్నప్పుడు, పార్టనర్ ఇచ్చే ఒక చిన్న టచ్ , దగ్గరతనం ఆ ఒత్తిడిని తగ్గించి, బంధాన్ని తిరిగి గాడిలో పెడుతుందని సైకాలజీ చెబుతోంది. అందుకే, ఫిజికల్ ఇంటిమసీ తక్కువగా ఉన్న బంధాలలో తరచుగా గొడవలు, చికాకులు రావడం గమనిస్తుంటాం.
అలాగే ఆ ఇద్దరి మధ్య ఇది పరస్పర అవగాహనను పెంచుతుంది. ఒకరి అవసరాలను మరొకరు గుర్తించడం, ఒకరి ఇష్టాలను గౌరవించడం అనేది అక్కడ నుంచే మొదలవుతుంది. అయితే ఫిజికల్ ఇంటిమసీ అనేది కేవలం పడకగదికి మాత్రమే పరిమితం కాదని నిపుణులు చెబుతారు ఎందుకంటే అది భాగస్వామి పట్ల వారికున్న బాధ్యతను, అంకితభావాన్ని కూడా గుర్తు చేస్తుంది.
పెళ్లిలో అయినా, లివ్-ఇన్ లో అయినా వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకరితో ఒకరు కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడే, జీవితంలోని ఇతర సమస్యల గురించి కూడా నిర్మొహమాటంగా ఆ ఇద్దరూ చర్చించుకోగలరు. అంటే, శారీరక సాన్నిహిత్యమనేది మానసిక సాన్నిహిత్యానికి పునాది వంటిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
అయితే, తమ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది దీనిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. పని ఒత్తిడి, టైమ్ లేకపోవడం వంటి కారణాలతో భాగస్వామితో గడిపే సమయం తగ్గించేస్తున్నారు. దీనివల్ల రానురాను వారి బంధంలో ఒక రకమైన శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యమే మెల్లగా అపార్థాలకు, అసంతృప్తికి దారి తీసేలా చేస్తుందని అంటున్నారు.

ఫిజికల్ రిలేషన్ అనేది కేవలం ఒక క్రియ కాదు, అది మాటలు లేని చోట భావాలను పలికించే ఒక భాష. భాగస్వామి పట్ల అవతలివారికి ఉన్న ఆకర్షణను, ప్రేమను నిత్యం కొత్తగా ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకరినొకరు తాకడం, కౌగిలించుకోవడం ద్వారా కలిగే సాన్నిహిత్యం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే నిద్రలేమిని దూరం చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చివరగా, ఒక బంధం నిలబడాలంటే ఇద్దరి మధ్య ఒక రకమైన స్పార్క్ ఉండాలి. ఆ స్పార్క్ నిరంతరం వెలుగుతూ ఉండాలంటే శారీరక సాన్నిహిత్యం చాలా అవసరం అంటారు సైకాలజిస్టులు. ఎందుకంటే ఇది వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, ఒకరికొకరు ప్రత్యేకమైన వారమనే ఫీలింగ్‌ను కలిగిస్తుందట.
నిజానికి నిజమైన సంతోషం బయటి ప్రపంచంలో ఉండనే ఉండదు, అది భాగస్వామితో పంచుకునే ఆ ఆత్మీయ క్షణాల్లోనే దాగి ఉంటుంది. అందుకే, ఈ సహజమైన అవసరాన్ని గుర్తించి, గౌరవించి, బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.





