Just LifestyleHealthLatest News

Appreciation:మంచి పని చేస్తే మెచ్చుకోండి..అది కూడా మనసారా మెచ్చుకోవాలట..ఎందుకంటే?

Appreciation: అది ఎదుటి మనిషి లోపాలను దాచిపెట్టి చేసేది కాదు, వారిలోని గొప్పదనాన్ని బయటకు తీసే ప్రయత్నం అని గుర్తించాలి.

Appreciation

చేసే పని చిన్నదో,పెద్దదో.. కానీ దానిని ఇతరులు మెచ్చుకుంటే మాత్రం వారిలో కొండంత బూస్ట్‌ వచ్చేస్తుంది . ఎందుకంటే ప్రతి మనిషిలోనూ లోలోపల ఒక చిన్న కోరిక ఉంటుంది. తను చేసే పనిని ఎవరో ఒకరు గుర్తించాలని, మెచ్చుకోవాలని(Appreciation) అనుకుంటారు. అయితే సైకాలజీ ప్రకారం ఇది ఆశించడం కాదు.. ఒక ప్రాథమిక మానసిక అవసరం.

చిన్నపిల్లాడు తనకు నచ్చిన బొమ్మ గీసినప్పుడు తల్లిదండ్రుల వైపు చూసే చూపులో ఎంత ఆశ దాగి ఉంటుందో, పెద్దయ్యాక కూడా తాము చేసే ప్రతి చిన్న పనిలోనూ అదే స్థాయి గుర్తింపును ఆశిస్తారు. సైకాలజీ ప్రకారం, ఒక వ్యక్తిని అభినందించడమంటే.. వారి ఉనికిని మనం గుర్తించి వారిని గౌరవించడమే. ఎప్పుడైతే ఆ గుర్తింపు లభించదో, వారికి తెలీకుండానే ఓ తెలియని నిరాశ, పని పట్ల అశ్రద్ధ మొదలవుతాయి

అందుకే మెచ్చుకోవడమనేది ఒక అద్భుతమైన ప్రేరణా శక్తి. చాలామంది దీన్ని కేవలం మాటలకే పరిమితమని అనుకుంటారు కానీ, నిజానికి ఇది ఒక వ్యక్తిలో కాన్ఫిడెన్స్‌ను నిలబెట్టే పునాది అంటారు సైకాలజిస్టులు. చేసే పనికి వెంటనే ఒక చిన్న ప్రశంస లభిస్తే, ఆ పనిని మరింత బాగా చేయాలనే తపన వారిలో పెరుగుతుంది. అంతేకాదు మెచ్చుకోలు సరైన సమయంలో, సరైన రీతిలో చెప్పకపోతే దాని ఎఫెక్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. అందుకే మెచ్చుకోవడంలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అంటారు సైకాలజిస్టులు.

ఎవరైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు, ఆ క్షణంలో మన నుంచి వచ్చే ఒక చిరునవ్వు, ఒక చిన్న మాట వారిలో కొండంత ఉత్సాహాన్ని నింపుతాయి. అయితే ఈ రోజుల్లో మెచ్చుకోవడం అనే సహజ గుణం తగ్గిపోయి, దాని స్థానంలో అవతలి వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి, వారి నుంచి ఏదో ఆశించి లేదా చెప్పకపోతే బాగోదు అనో చేసే కృత్రిమ పొగడ్త అయిన ముఖస్తుతి వచ్చి చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తిని నువ్వు బాగానే చేశావని పైపైన అనడం ముఖస్తుతి అయితే, వారు చేసిన పనిలోని లోతును గుర్తించి చాలా అద్భుతంగా చేశావని మనస్ఫూర్తిగా అనడం నిజమైన మెచ్చుకోలు.

ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మెచ్చుకోలు(Appreciation) ఇచ్చే విషయంలో చాలామంది పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఎదుటి వ్యక్తి చేసేపనిలో తప్పులు వెతికే మనస్తత్వమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు చేసే దానిలో నిజంగానే లోపం కనిపిస్తే బాగానే చేశావు కానీ .. ఇంకా ఇలా చేసి ఉంటే బాగుంటుందని చెప్పే మనుషులు కావాలి.

Appreciation
Appreciation

అందుకే నిజానికి ప్రశంసించడమనేది ఒక ఆర్ట్ అని సైకాలజిస్టులు అంటున్నారు. అయితే అది ఎదుటి మనిషి లోపాలను దాచిపెట్టి చేసేది కాదు, వారిలోని గొప్పదనాన్ని బయటకు తీసే ప్రయత్నం అని గుర్తించాలి. ఎవరైతే ఇతరులను మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారో, వారు తమ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని నిర్మించుకోగలగుతారు. ప్రశంసల ద్వారా రిలేషన్స్ బలపడతాయి, మనుషుల మధ్య దూరం కూడా తగ్గుతుంది.

మెచ్చుకోవడం వల్ల తీసుకునే వారికి అంతులేని ఎనర్జీ లభించడమే కాదు.. ఇచ్చే వారికి కూడా మంచిదేనట. ఎందుకంటే సైకాలజీ ప్రకారం చూస్తే, ఎవరైతే ఇతరులను మనస్ఫూర్తిగా అభినందిస్తారో, వారు మానసికంగా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఇకనుంచి అయినా మీ మానసిక ప్రశాంతత కోసం.. అవతలివారికి నిజమైన సంతోషాన్ని ఇవ్వడం కోసం మెచ్చుకోవడాన్ని అలవాటు చేసుకోండి మరి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button