Rohini Karthe:రోహిణి కార్తె ఎంటర్ అయిపోతుంది.. ఈసారి ముందే ఎండల తీవ్రత ఎందుకు ఎక్కువయింది?
Rohini Karthe : మే 25, సోమవారం రాత్రి 8.24 గంటలకు సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో ఈ కార్తె ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత జూన్ 8న మృగశిర కార్తె రాకతో మళ్లీ వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది.
Rohini Karthe
వేసవి కాలంలో రోహిణి కార్తెతో ఎండల తీవ్రతతో రోళ్లు కూడా పగిలిపోతాయని అంటారు. అలాంటి భయంకరమైన ఎండలు ఇవాళ రాత్రి నుంచే షురూ కానుంది. ఇప్పటికే 40 రోజులుగా భానుడి భగభగలతో జనాలు అల్లాడిపోతుండగా, రాబోయే మరో 15 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జ్యోతిష్య పంచాంగం ప్రకారం ఈరోజు మే 25, సోమవారం రాత్రి 8.24 గంటలకు సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో ఈ కార్తె ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత జూన్ 8న మృగశిర కార్తె రాకతో మళ్లీ వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది.
రోహిణి అంటే ఎర్రని కాంతి అని అర్థం. ఖగోళ శాస్త్రంలో దీనిని అల్డెబరన్ అనే ఎర్రని నక్షత్రంగా పిలుస్తుంటారు.ఈ సమయంలో సూర్యుడు ఈ నక్షత్రానికి దగ్గరగా రావడం వల్లే భూమిపై ఎండల ప్రతాపం ఓ రేంజ్లో ఉంటుంది. సూర్యకిరణాలు డైరెక్టుగా నిలువుగా భూమిని తాకడం వల్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతుంటాయి.
ఈసారి రోహిణి కార్తె రాక కంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాగా దంచికొడుతున్నాయి. ఎండదెబ్బకు భయపడి జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో మధ్యాహ్నం పూట రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వడదెబ్బ వల్ల ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.
బంగాళాఖాతంలో వచ్చిన అల్పపీడనం వల్ల ..గాలిలోని తేమ శాతం పూర్తిగా తగ్గిపోయిందని, అదే సమయంలో రాజస్థాన్ వైపు నుంచి వీస్తున్న వేడిగాలులు భారతదేశం వైపు రావడం వల్లే ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగాయని విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు.
దీనికితోడు గతంలో 2015, 2023 సంవత్సరాలలో కనిపించిన ఎల్ నినో ఎఫెక్ట్ ఈ ఏడాది మరింత బలంగా ఉంది. దీనివల్ల గతంలో కంటే రెండు డిగ్రీల అదనపు వేడి అలాగే ఉక్కపోత విపరీతంగా పెరిగిపోయింది.

కాగా ఈ తీవ్రమైన వేడి , పీడన మార్పుల వల్ల అక్కడక్కడా హఠాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడినా ఆ సమయంలో మాత్రమే చల్లబడి, మరుసటి రోజు నుంచి ఎండలు మళ్లీ యథావిధిగా దంచికొడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఈ నరకానికి జూన్ 8న బ్రేక్ పడనుంది. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రవేశించనుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు.. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురుస్తాయి. అప్పటివరకు ప్రజలంతా ఎండల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
Aura: తలనొప్పి, మానసిక అలసట వదలడం లేదా? మీ జీవితంలో ఆరా పాత్ర తెలుసుకోండి..





