Fake Friendships : నకిలీ స్నేహాలకు గుడ్ బై చెప్పండి.. గొడవలు లేకుండా దూరం పెట్టాలంటే ఇవి తెలుసుకోండి
Fake Friendships : మన చుట్టూ ఉన్నవారిలో ఎవరు మన క్షేమం కోరుకుంటున్నారో.. ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మనల్ని వాడుకుంటున్నారో గుర్తించడం చాలా ఇంపార్టెంట్.
Fake Friendships
మన లైఫ్ జర్నీలో మనకు ఎంతోమంది పరిచయమవుతూ ఉంటారు. కానీ అందరూ నిజమైన స్నేహితులు కాలేరు. అందుకే నిజమైన స్నేహం ప్రాణం పోస్తే, నకిలీ స్నేహం(Fake Friendships) మనశ్శాంతిని హరిస్తుందంటారు. మన చుట్టూ ఉన్నవారిలో ఎవరు మన క్షేమం కోరుకుంటున్నారో.. ఎవరు కేవలం తమ స్వార్థం కోసం మనల్ని వాడుకుంటున్నారో గుర్తించడం చాలా ఇంపార్టెంట్.
కొందరు స్నేహితులు మన ఎనర్జీని, టైమ్‌ను పీల్చేస్తూ మనల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంటారు. అలాంటి వారిని మార్చడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ వారితో గొడవ పడకుండానే వారికి దూరం జరగడం ఒక కళ అంటారు మానసిక నిపుణులు.
ఫేక్ ఫ్రెండ్స్(Fake Friendships) ఎప్పుడూ తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన ముందు ప్రత్యక్షమవుతుంటారు. వారు పిలవగానే పలకడం, మెసేజ్ చేయగానే వెంటనే రిప్లై ఇవ్వడం వంటివి చేయడం వల్ల మీరు వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే ఫీల్ కలుగుతుంది.
దీనిని కంట్రోల్ చేయడానికి మీరు రియాక్ట్ అయ్యే సమయాన్ని నెమ్మదిగా పెంచాలి. నిమిషాల్లో ఇచ్చే రిప్లైని గంటలకు, ఆపై రోజులకు మార్చాలి. ఇలా చేయడం వల్ల మీరు బిజీగా ఉన్నారనే సంకేతం వారికి మనం ఎలాంటి సమాధానం చెప్పకుండానే వారికి కావాల్సిన సమాధానం అందుతుంది. మెల్లగా వారు తమ అవసరాల కోసం వేరొకరిని వెతుక్కునే ఛాన్స్ ఉంటుంది.
స్వార్ధంగా ఉండే స్నేహితులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ సహాయాలు కానీ కోరుతుంటారు. అన్ని సమయాలలో మొహమాటానికి పోయి సరే అనడం వల్ల మీ మనశ్శాంతి దెబ్బతింటుంది. అందుకే వద్దు లేదా లేదు అని ముందే చెప్పడం నేర్చుకోండి.
వారికి అతిగా వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఎక్కువ వివరణ ఇస్తే, వారే తిరిగి మిమ్మల్ని ఒప్పించడానికి అంత ఎక్కువ అవకాశం దొరికినట్లు అవుతుంది. ప్రస్తుతం నేను అది చేయలేనని ఒక్క మాటతో ముగించడం వల్ల మీ బౌండరీస్ (Boundaries) బలంగా ఉంటాయి.
ఫేక్ ఫ్రెండ్స్ మీ బలహీనతలను తెలుసుకుని, సమయం వచ్చినప్పుడు వాటితోనే మీకు వ్యతిరేకంగా వాడుతుంటారు. అందుకే మీ పర్సనల్ విషయాలను, సీక్రెట్స్‌ను,ఫ్యూచర్ ప్లాన్‌ను వారితో పంచుకోవడం పూర్తిగా ఆపేయండి.
వారితో మాట్లాడేటప్పుడు కేవలం పైపై విషయాలను మాత్రమే మాట్లాడండి. మీ నుంచి వారికి కావాల్సిన ఎలాంటి సమాచారం కానీ ప్రయోజనం కానీ దక్కనప్పుడు, వారే మీ నుంచి మెల్లగా దూరమవుతారు. ఒకవేళ వారిని కలవాల్సి వస్తే, ఒంటరిగా కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు కలవండి, దీని ద్వారా వారి ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది.

వారు ఏదైనా ప్లాన్ చేసినప్పుడో, కలవాలని ఒత్తిడి చేసినప్పుడో, మీ పర్సనల్ లేదా ఆఫీసు పనుల వల్ల మీరు చాలా బిజీగా ఉన్నానని సున్నితంగా చెప్పండి. పదే పదే మీరు వారికి అందుబాటులో లేరని తెలిసినప్పుడు, వారు మీపై ఆధారపడటం మానేసి దూరంగా ఉంటారు. ఈ పద్ధతి వల్ల ఎటువంటి గొడవలు లేకుండా వారికి దూరం జరగొచ్చు.
ఏ బంధమైనా, ఎలాంటి స్నేహమయినా మనల్ని మానసికంగా కృంగదీస్తుంటే మాత్రం వెంటనే దాని నుంచి తప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మనశ్శాంతిని ఇచ్చే స్నేహం ప్రాణం వంటిది, కానీ మనశ్శాంతిని తీసేసే స్నేహం మరో తలనొప్పితో సమానం.
ఫేక్ ఫ్రెండ్షిప్(Fake Friendships)ల బరువును మోస్తూ జీవితాన్ని భారంగా మార్చుకోకుండా, మనల్ని మెచ్చుకునే, ప్రోత్సహించే మంచి వ్యక్తుల మధ్య ఉండటమే మంచిది. మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీ ఫస్ట్ ప్రయారిటీ కావాలన్నది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.





