Gold Pledge : తాకట్టు పెట్టిన గోల్డ్ మీ చేతికి ఇవ్వలేదా? ఈ ఆయుధం మీ దగ్గరుంటే బ్యాంకులు దిగి వస్తాయ్..
Gold Pledge : మీ లోన్‌కు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత కూడా బ్యాంక్ మీ గోల్డ్‌ను మీకు తిరిగి ఇవ్వకుండా తమ దగ్గరే ఉంచుకునే అధికారం కొన్ని సందర్భాలలో బ్యాంకులకు ఉంటుంది.
Gold Pledge
ఎమెర్జెన్సీ కోసం, ఇతర అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలని అనుకున్నపుడు మన కళ్లు ఇంట్లో ఉన్న బంగారం మీదే పడుతుంది. ఒకరిని అప్పు ఇవ్వమని అడగాల్సిన పని ఉండదు. సిబిల్ స్కోర్‌తో సంబంధం ఉండదు.. పెద్దగా డాక్యుమెంట్ల గొడవ ఉండదు. గంట వ్యవధిలోనే చేతిలో క్యాష్ పడిపోతుందని గోల్డ్ లోన్ వైపే మొగ్గు చూపిస్తాం.
పైగా పర్సనల్ లోన్లతో పోలిస్తే ఇంట్రస్ట్ రేట్లు చాలా తక్కువ. దీనికి తోడు గోల్డ్ ధరలు పెరగడంతో లోన్ అమౌంట్ కూడా ఎక్కువే వస్తుంది. అయితే ఇక్కడే కొన్నిసార్లు ఒక ఆపద దాక్కుని ఉంటుంది. మీ లోన్‌కు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత కూడా బ్యాంక్ మీ గోల్డ్‌ను మీకు తిరిగి ఇవ్వకుండా తమ దగ్గరే ఉంచుకునే అధికారం కొన్నిసార్లు బ్యాంకులకు ఉంటుంది.
సాధారణంగా లోన్ క్లియర్ చేయగానే గోల్డ్ ఇచ్చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ మీరు బంగారం లోన్ పూర్తిగా కట్టేసినా కూడా.. అదే బ్యాంకులో మీ పేరు మీద వేరే ఏదైనా లోన్ పెండింగ్‌లో ఉన్నా, లేదా వేరొకరి రుణానికి మీరు గ్యారెంటర్ (కో-దరఖాస్తుదారు)గా సైన్ పెడితే మాత్రం బ్యాంకులు మీ గోల్డ్‌ను జప్తు చేసుకునే హక్కు పొందుతాయి.
అంతేకాకుండా మీ ఫ్యూచర్ లోన్స్‌కు లేదా ఇతర బకాయిలకు ఈ బంగారాన్ని ష్యూరిటీగా వాడుకోవచ్చనే కండీషన్‌పై సంతకం పెట్టినా కూడా మీ నగలను వెనక్కి ఇవ్వరు. అందుకే గోల్డ్ లోన్(Gold Pledge) పేపర్లపై సైన్ పెట్టేటప్పుడు ఆ సన్నటి అక్షరాల కండిషన్స్ అన్నింటినీ కూడా పక్కాగా, క్లియర్‌గా చదవడం చాలా ఇంపార్టెంట్.

ఒకవేళ మీరు లోన్ మొత్తం కట్టేసినా కూడా అలాగే వేరే ఎలాంటి బకాయిలు లేకపోయినా సరే బ్యాంక్ మీ ఆభరణాలను ఇవ్వడానికి నిరాకరిస్తే అస్సలు భయపడాల్సిన పనేలేదు. ముందుగా బ్యాంక్ నుంచి రాతపూర్వకంగా రీజన్ అడిగి తీసుకోండి. ఆ వివరణతో మీరు సంతృప్తి చెందకపోతే.. ముందుగా బ్యాంక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయండి. అక్కడా 30 రోజుల్లో సొల్యూషన్ దొరక్కపోతే.. ఆర్బీఐ ప్రయోగించే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ అనే అస్త్రాన్ని వాడండి.
మీ దగ్గర ఉన్న లోన్ తీసుకున్న పేపర్లు, చెల్లించిన రసీదులు రెడీగా ఉంచుకుని ఆర్బీఐకి ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే చాలు. మీ వైపు తప్పు లేదని తేలితే ఆర్బీఐ మీ గోల్డ్‌ను మీకు ఇప్పించడమే కాకుండా, బ్యాంక్ చేసిన పని వల్ల మీకు జరిగిన నష్టానికి గాను నష్టపరిహారం కూడా వచ్చేలా చేస్తుంది.





