Just LiteratureLatest News

Teachers Day : గురుభ్యోన్నమః

Teachers Day : ఒకప్పుడు విద్యార్థి అంటే మాతా పిత స్థానంలో గురువును నిలబెట్టి గౌరవంగా కాలికి తొడిగిన గండపెండేరములా అగుపించేవాడు..

Teachers Day

ఒకప్పుడు
ఉపాధ్యాయుడంటే
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే విజ్ఞాన దీపం..
అవని నుంచి ఆకాశానికి
విద్య అనే నిచ్చెనేసిన నిలువెత్తు రూపం..

దారి తప్పిన సంద్రంలో
దిక్సూచిలా అగుపించేవాడు..
ఓడిపోయిన ఎడారిలో
ఒయాసిస్ అనిపించేవాడు..

నల్లబల్ల పొలంలో
అక్షర విత్తనాలు వెదజల్లుతూ
పిల్ల పక్షుల మెదళ్లకు
ఆహారమందించేవాడు..

సుద్దముక్కనే ఉలిలా
ప్రశ్నలతో పదునెక్కించి
జ్ఞానమనే శిల్పానికి
రూపమిచ్చేవాడు..

కలమనే హలంతో
తప్పుల కలుపులు ఏరేస్తూ
విజయంలో భుజం తట్టి
అభినందించేవాడు..
ఓటమిలో వెన్ను తట్టి
ప్రోత్సహించేవాడు..

ఒకప్పుడు
విద్యార్థి అంటే

మాతా పిత స్థానంలో
గురువును నిలబెట్టి
గౌరవంగా కాలికి తొడిగిన
గండపెండేరములా అగుపించేవాడు…

ఉపాధ్యాయుడుని
చేరాల్సిన గమ్యానికి
దారి చూపే దీప స్తంభంలా
భావించే నావికుడు..

బెత్తం దెబ్బలు తిన్నా ,ఏనాడు
చిత్తములో పెట్టుకోలేదు..
మార్కులు పరంగా వెనకబడిన
మానసికంగా దృఢంగా ఉండేవాడు..

ఒకప్పుడు
పాఠశాల అంటే
మన కలల కార్ఖానా..
మనసుకు నచ్చిన చదువు..
మమతను పంచిన బడి..

మార్కుల మాయ లేదు..
ర్యాంకుల రభస లేదు..
పక్కవాడి విజయంతో
తనను తాను కొలిచే గోల లేదు..

పాఠశాల అంటే ఒత్తిడి కాదు..
ఊపిరి తీసుకోనివ్వని పరుగు కాదు..
బాల్యాన్ని బంధించే బోను కాదు..
మనసులు వికసించే తోట..

ఇప్పుడు అంతా మారింది

అంకెల ఒత్తిడి..
అంచనాల బరువు
తల్లిదండ్రుల ఆశలు..
పాఠశాలల ఒత్తిళ్లు..
ర్యాంకుల రణరంగాలు..
యాప్‌ల గోలలు..
వంద శాతం ఫలితాలు..
ప్రపంచ బ్యాంకు అప్పులు కోసమే
వేలవేల తిప్పలు..

ఇంత మారినా..
గురువు మాత్రం మారలేదు..
మారకూడదు కూడా!

నిన్న సుద్దముక్కతో
అక్షరాలు దిద్దిన చేయి..
నేడు స్మార్ట్‌బోర్డుతో
సాంకేతికతను నడిపిస్తున్నా..
ఆ చేయి చెక్కేది మాత్రం
విద్యార్థి భవిష్యత్తునే…

గూగుల్ ప్రపంచాన్ని అరచేతిలో పెడితే..
గురువు ఆ చేతిని
ప్రపంచానికి ఉపయోగపడే చేతిలా మలుస్తాడు!
అలాంటి గురువులందరికీ
గురుభ్యోన్నమః..

– ఫణి మండల

Elephant Parenting : పిల్లలపై అతిగా ఒత్తిడి తెస్తున్నారా? ఏనుగుల సీక్రెట్ ఫాలో అయితే మీ పిల్లలు హీరోలు అవుతారు..

Related Articles

Back to top button