Manoj Tiwary : టీ, బిస్కెట్లు తినడమే నా పని..మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
Manoj Tiwary : బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడంతో గతంలో జరిగిన పలు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
Manoj Tiwary
బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడంతో గతంలో జరిగిన పలు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీఏంసీ ఓటమికి మమతా బెనర్జీ వెన్నంటి ఉండే కొందరు మంత్రులు, నేతల తీరే కారణమన్న ప్రచారమే నిజమవుతోంది. తాజాగా అప్పటి ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ(Manoj Tiwary) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
టీఏంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతూ తివారీ(Manoj Tiwary) ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తన పట్ల టీఏంసీ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనను ఐదు కోట్లు అడిగారనీ, ఇవ్వకపోవడంతోనే శిబ్ పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించారని ఆరోపించాడు. తాను పేరుకే క్రీడా శాఖ సహాయమంత్రిగా ఉన్నానని గుర్తు చేసుకున్నాడు.
మాజీ మంత్రి అరూప్ బిస్వాస్ తనను ఏ పనీ చేయకుండా అడ్డుకునే వారనీ, క్రీడల శాఖలో కేవలం టీ, బిస్కెట్లు తినడానికే పరిమితం చేశారన్నాడు.క్రీడాకారుడిగా క్రీడలకు ఎంతో సేవ చేయాలనుకుంటే అది జరగనివ్వకుండా అడ్డుపడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశాడు.మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పెడితే మమతా బెనర్జీ వాటిని కనీసం పరిశీలించలేదన్నాడు.నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడేందుకు మమతా బెనర్జీని కలిసేందుకు ప్రయత్నిస్తే కనీసం 20 సెకన్లు కూడా టైమ్ ఇవ్వలేదన్నాడు.
టీఎంసీలో చాలా మంది నేతలు ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసమే పని చేసారనీ, ప్రతీ చోటా అవినీతికి పాల్పడ్డారన్నాడు. ఈ పరిణామాలను తాను ప్రత్యక్షంగా చూసాననీ, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనీ తాను అప్పుడే గ్రహించినట్టు తెలిపాడు. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ యోహాన్ బ్లేక్ తో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మించాలనుకుంటే దానికి ఐదు కోట్లు ఖర్చు అవుతుందన్న కారణంగా పక్కన పెట్టేశారన్నాడు.

క్రీడల కోసం కేటాయించిన రూ.700 కోట్ల బడ్జెట్ ను వృథా చేసారన్నాడు. అలాగే మెస్సీ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ కావడానికి అరూప్ బిస్వాస్ ప్రవర్తనే కారణమన్నాడు. అరూప్ బిస్వాస్ తన అనుచరులు, కుటుంబసభ్యులతో నానా హంగామా చేసారనీ, అందుకే మెస్సీ అసహనంతో వెళ్ళిపోయారన్నాడు.
అంత పెద్ద ప్రతిష్టాత్మక ఈవెంట్ కేవలం టీఏంసీ నేతల తీరుతోనే వివాదాస్పదంగా మిగిలిపోయిందన్నాడు. ఇదిలా ఉంటే మెస్సీ టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా సైతం ఈవెంట్ ఫ్లాప్ అవడానికి అప్పటి మంత్రి అరూప్ బిస్వాసే కారణమని ఆరోపించారు.
Vijay :విజయ్‌కు పెరుగుతున్న మద్దతు.. గవర్నర్ తీరుపై సెలబ్రెటీల ఫైర్





