Just NationalJust Business

Petrol:వాహనదారులకు షాక్.. పెట్రో భారం తర్వాత మరో వాత..

Petrol :దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరను కిలోకు రూ. 2 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Petrol

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితులు.. ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా తయారయ్యాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్న వాహనదారులకు గ్యాస్ పంపిణీ సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా ఫ్యూయల్ సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద దిగ్బంధం కొనసాగుతూ ఉండటంతో, దిగుమతి ఖర్చులు పెరిగి దేశీయంగా సీఎన్‌జీ (CNG) ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ సముద్ర మార్గంలో అంతరాయం కలగడం భారత్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరను కిలోకు రూ. 2 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ ధరలు వెంటనే అమలులోకి రావడంతో వాహనదారులపై అలాగే ప్రయాణికులపైన కూడా భారం పెరగనుంది.

ఈ తాజా పెంపు వల్ల దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 77.59కి చేరగా, ముంబైలో రూ. 82.27 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల్లో కూడా రవాణా ఖర్చులను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్(Petrol), డీజిల్ ధరలు ఇప్పటికే లీటరుకు రూ. 3 కంటే ఎక్కువ పెరగడంతో ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల నిర్వహణ ఖర్చు భారమైంది.

ఇప్పుడు సీఎన్‌జీ కూడా ప్రియం కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా కూరగాయల రేట్లు పెరిగే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్‌కు, అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఏ చిన్న మార్పు అయినా ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది.

Petrol
Petrol

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన కొరత లేదని భరోసా ఇస్తున్నా సరే, ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. నాలుగేళ్లుగా ఇంధన ధరలను పెంచకుండా కంట్రోల్ చేసిన ఏకైక దేశం మనదేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెబుతున్నా కూడా, ఎన్నికల తర్వాతే ఈ పెంపు మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 తర్వాత ఇప్పుడే ధరలను సవరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

మరోవైపు, పెట్రోల్(Petrol) , గ్యాస్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని, పరోక్షంగా ఇది ఈవీ విప్లవానికి దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, అంతర్జాతీయ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే మాత్రం.. రాబోయే రోజుల్లో ఫ్యూయల్ ధరలు సామాన్యులకు మరింత చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Lassi : బరువు తగ్గాలంటే మజ్జిగ బలం కావాలంటే లస్సీ..ఈ సమ్మర్‌లో మీరేం తాగుతారు?

Related Articles

Back to top button