Telegram : సమాజానికి ముప్పుగా మారిన టెలిగ్రామ్..ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదనలు
Telegram : టెలిగ్రామ్ కేవలం ఒక చాటింగ్ యాప్‌లా కాకుండా.. సమాజానికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది
Telegram
సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఎక్స్ , ఇన్ స్టాగ్రామ్ , వాట్సాప్ వంటి మేసేజింగ్ ఫ్లాట్ ఫారమ్స్ లో టెలిగ్రామ్ కు ప్రత్యేక స్థానముంది. మిగిలిన వాటితో పోలిస్తే దీనిలో ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోన్ నెంబర్ తో పనిలేకుండా యూజర్ ఐడీతో లాగిన్ అవ్వొచ్చు. అందుకే నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు , ఇతర అసాంఘిక ముఠాలకు ఇది అడ్డాగా మారిపోయిందన్న విమర్శలున్నాయి.
తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఇదే విషయాలను కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి టెలిగ్రామ్(Telegram) పై నిషేధం విధించింది.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో కేసుకు సంబంధించి టెలిగ్రామ్ పై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్(Telegram) యాప్ దేశంలో కొత్త డార్క్ వెబ్ గా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు, ఇతర అసాంఘిక కార్యాకలాపాలకు చిరునామాగా మార్చుకున్నారనీ పేర్కొంది. అలాగే తీవ్రవాద గ్రూపులకు కూడా ఇదొక స్థావరంలా మారిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక విషయాలను కోర్టుకు తెలియజేసింది. నేరగాళ్లు ఈ యాప్‌ను ఎలా వాడుకుంటున్నారో పూర్తి వివరాలతో సహా న్యాయస్థానం ముందు పెట్టింది.
టెలిగ్రామ్ కేవలం ఒక చాటింగ్ యాప్‌లా కాకుండా.. సమాజానికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంచలనం సృష్టించిన NEET పేపర్ల లీకేజీ దగ్గర నుంచి సైబర్ మోసాలు, బెట్టింగ్ మాఫియా, డ్రగ్స్ రవాణా, ఆర్థిక నేరాల వంటి వాటికి టెలిగ్రామ్ వేదికగా మారిందని కేంద్రం ఆరోపించింది.
నేరస్థులు టెలిగ్రామ్ ఛానళ్లలో లింకులను పోస్ట్ చేస్తూ.. వాటి ద్వారా వినియోగదారులను డీప్ వెబ్, డార్క్ వెబ్ లకు మళ్లిస్తున్నారని తెలిపింది. దీంతో నిందితులను వెతకడం అధికారులకు క్లిష్టంగా మారిందని పేర్కొంది.

టెలిగ్రామ్ లో ఉన్న మితిమీరిన ప్రైవసీ ఫీచర్లే ఈ క్రిమినల్ నెట్‌వర్క్‌ల విస్తరణకు కారణంగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ కంటెంట్ కూడా ఈ యాప్‌లో యథేచ్ఛగా చెలామణి అవుతోందని కోర్టుకు తెలిపింది. చాలా మంది హ్యాకర్లు టెలిగ్రామ్ ద్వారా వినియోగదారుల డేటాను చోరీ చేస్తున్నారనీ కేంద్రం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో టెలిగ్రామ్(Telegram) ద్వారానే నిందితులు తమ ప్లాన్ ను అమలు చేసారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కేంద్రం వాదనలు, ఇచ్చిన నివేదిక పరిశీలించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
Aquarius : సమాజ శ్రేయస్సు, ఒంటరిగా ఉండే మనస్తత్వం..కుంభరాశి వారి మైండ్ సెట్ ఇదే





