Aja Ekadashi : కష్టాలన్నిటినీ పటాపంచల్ చేసే అజ ఏకాదశి..ఆనంద ఏకాదశిని ఎప్పుడు ఎలా చేయాలి?
Aja Ekadashi : సెప్టెంబర్ 7న భక్తులు అజ ఏకాదశి ఉపవాస దీక్షను రోజంతా ఆచరిస్తారు. తర్వాత సెప్టెంబర్ 8 వ తేదీ, మంగళవారం ఉదయం 6:02 గంటల నుంచి 8:33 గంటల మధ్య ద్వాదశి పారణ చేశాక, పూజ ముగించుకుని ఉపవాసాన్ని విరమిస్తారు.
Aja Ekadashi
భాద్రపద మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి, ఆనంద ఏకాదశి అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైన ఏకాదశి వ్రతాల్లో దీనికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఎంతోమందికి కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విజయం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. తెలిసీ తెలీక చేసిన అన్ని పాపాలను నివారించి, ఇంటిళ్లపాదికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ పవిత్ర ఏకాదశి.
హిందూ పంచాంగం ప్రకారం ఈ 2026లో అజ ఏకాదశి సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం రోజు వస్తోంది. ఏకాదశి తిథి సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 7:29 గంటలకు ప్రారంభమయిన అజ ఏకాదశి.. సెప్టెంబర్ 7వ తేదీన, సోమవారం సాయంత్రం 5:03 గంటల వరకు ఉంటుంది.
మన హిందూ సంప్రదాయంలో సూర్యోదయ తిథిని లేదంటే ఉదయతిథినే అంతా ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి. సెప్టెంబర్ 7న భక్తులు అజ ఏకాదశి ఉపవాస దీక్షను రోజంతా ఆచరిస్తారు. తర్వాత సెప్టెంబర్ 8 వ తేదీ, మంగళవారం ఉదయం 6:02 గంటల నుంచి 8:33 గంటల మధ్య ద్వాదశి పారణ చేశాక, పూజ ముగించుకుని ఉపవాసాన్ని విరమిస్తారు.
ఆనంద ఏకాదశి వెనుకున్న పురాణ కథను ఒకసారి చూస్తే.. ఈ వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకి వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది. సత్యపాలనకు మారుపేరుగా ఉండే హరిశ్చంద్ర చక్రవర్తి తన సత్యనిష్ఠను నిలబెట్టుకోవడానికి రాజ్యాన్ని,యావత్ సంపదను కోల్పోయి వారణాశిలో కాటికాపరిగా మారతాడు.
భార్యాపిల్లలకు దూరమై దుఃఖంలో ఉన్న హరిశ్చంద్రుడిని కలిసిన గౌతమ మహర్షి .. అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని ఉపదేశిస్తాడు. ముని చెప్పినట్లుగానే హరిశ్చంద్రుడు ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాడు. ఈ వ్రత ప్రభావంతో హరిశ్చంద్రుడు పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అంతేకాకుండా పోగొట్టుకున్న రాజ్యాన్ని, భార్యాపిల్లలను కూడా తిరిగి పొంది ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. అందుకే అజ ఏకాదశికి ఆనంద ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది.

అజ ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానాన్ని ఆచరించి వ్రత సంకల్పం తీసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండటం మంచిది. ఉండలేని వాళ్లు పాలు, పండ్లు తీసుకోవచ్చు. పూజా మందిరంలో శ్రీమహావిష్ణువు లేదా హృషీకేశుడి విగ్రహానికి లేదంటే చిత్రపటానికి తులసి దళాలు, పసుపు రంగు పువ్వులు, పండ్లు, చందనంతో పూజించాలి.
పూజ సమయంలో అజ ఏకాదశి వ్రత కథను చదువుకోవడం లేదంటే వినడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలం లభిస్తుంది. ఏకాదశి ముగిసి ద్వాదశి ఘడియలు ప్రారంభమయ్యాక బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ అన్నదానం చేసి, ఆ తర్వాత వ్రత పారణ చేయాలి.





