Atlataddi : మొదలైన అట్లతద్ది సందడి..పెరుగన్నం నుంచి 11 అట్ల వాయనం వెనుక ఉన్న అసలు రహస్యం
Atlataddi : తెలుగువారి ఆచారాల్లో ప్రత్యేకమైన అట్లతద్ది వేడుక ప్రారంభమయింది. తెల్లవారుజాము గోంగూర-పెరుగన్నం తిండి, 11 అట్ల ప్రాధాన్యత, గౌరీదేవి పూజా విధానం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Atlataddi
తెలుగువారి కల్చర్‌లో పండుగలు అంటే కేవలం దేవుడికి దండం పెట్టుకోవడమే కాదు.. దాంతో పాటు బోలెడన్ని సంబురాలు, అల్లర్లు, ముచ్చట్లు ఉంటాయి. సరిగ్గా అలాంటి కోవకే వస్తుంది అట్లతద్ది(అట్ల తదియ) పండుగ. ముఖ్యంగా తెలుగు ఇళ్లలో ఉన్న అమ్మాయిలు, పెళ్లి అయిన మహిళలు ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమకు మంచి భర్త దక్కాలని, వివాహమైన స్త్రీలు తమ భర్తకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జగజ్జనని అయిన గౌరీదేవిని మనస్ఫూర్తిగా పూజించే పర్వదినం ఇది. అశ్వయుజ మాసంలో వచ్చే ఈ పండుగ రోజు గ్రామీణ వాతావరణం అంతా ఒక కొత్త శోభను సంతరించుకుంటుంది.
ఈ పండుగలో సూర్యుడు ఇంకా నిద్రలేవక ముందే అట్లతద్దె(Atlataddi) జరుపుకునేవారి ఇళ్లలో సందడి మొదలవుతుంది. సంప్రదాయం ప్రకారం నిల్వ గోంగూర పచ్చడితో పెరుగన్నం తిని ఆ తర్వాత కఠినమైన ఉపవాస దీక్షలోకి దిగడం ఈ పండుగ ప్రత్యేకత. రోజంతా చుక్క నీరు కూడా ముట్టకుండా ఉంటూ, సాయంత్రం చంద్రుడి దర్శనం కోసం నిరీక్షిస్తారు. అమ్మాయిలు, మహిళలు అంతా ఒకచోట చేరి చేతులకు పెట్టుకున్న గోరింటాకు డిజైన్లను చూపిస్తూ ముచ్చట్లు పెట్టడం, ఉయ్యాలలపై ఊగుతూ పాటలు పాడుకోవడం ఈ వేడుకకు అసలైన కలర్‌ను ఇస్తుంది.
అయితే ఈ పండుగ నైవేద్యంలో మాత్రం 11 అనే నంబర్‌కు ఒక కథ ఉంది. గౌరమ్మను భక్తితో పూజిస్తూ 11 అట్లను నివేదనగా ఉంచుతారు. తర్వాత 11 మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి, వారికి తాంబూలంతో పాటు అట్లను వాయనంగా అందించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. వాయనం ఇచ్చిన తర్వాతే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు.
పూర్వం ఒక రాజకుమారి అట్లతద్దె(Atlataddi) నోమును నోచుకుంటూ.. నియమ నిష్టలను నిర్లక్ష్యం చేసి ఎదుర్కొన్న సమస్యలు, ఆ తర్వాత అమ్మవారి కృపతో పొందిన శుభఫలితాల కథను ఈ రోజు చదువుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఏది ఏమైనా, ఆధునిక కాలంలో కూడా భారతీయుల మూలాలను, సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. కుటుంబంలో ఆనందాలను నింపే పండుగ ఈ అట్లతద్ది అని చెప్పొచ్చు.
The Silence Of Men : ఐ యామ్ ఫైన్ వెనుక దాగున్న మగవారి సైలెన్స్..సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?





