Devi Navaratrulu : మొదలయిన దసరా వేడుకలు..ఒక్కో చోట ఒక్కోలా దసరా నవరాత్రులు..
Devi Navaratrulu : భారత్‌లోనే కాకుండా మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
Devi Navaratrulu
శరదృతువు రాకతో ఆశ్వయుజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు దేశమంతటా ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. శక్తి, జ్ఞానం, విజయాలకు సంకేతంగా జరుపుకొనే ఈ దసరా పండుగ ..ప్రాంతాన్ని బట్టి, అక్కడి కల్చర్‌ను బట్టి రకరకాల రూపాలను సంతరించుకుంటుంది. భారత్‌లోనే కాకుండా మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
తెలంగాణలో దసరా నవరాత్రుల కంటే ఒక్క రోజు ముందుగానే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల పాటు పూలను పేర్చి ఆడే బతుకమ్మ ఉత్సవాలు, సద్దుల బతుకమ్మతో ఎంతో వేడుకగా ముగుస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భర్తల దీర్ఘాయుష్షు కోసం మహిళలు రోజంతా ఏమీ తినకుండా ఉండే కర్వా చౌత్ ఉపవాసాలు చేస్తారు.

పశ్చిమ బెంగాల్లో అయితే మహాలయ పక్షం నుంచే దసరా వాతావరణంతో అక్కడ సందడి మొదలవుతుంది. భారీ ఆర్టిస్టిక్ పండాల్స్తో పాటు, రాజ్ బారీస్ అని పిలిచే శతాబ్దాల క్రితపు రాజభవనాల్లో బెంగాలీలు దుర్గామాతని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో కనుక చూస్తే..దసరా సమయంలో గంగా రాజవంశం నాటి గోసాని జాతర బాగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక శిల్పకళతో మలిచిన మట్టి విగ్రహాలు, ట్రెడిషనల్ యుద్ధ విద్యల ప్రదర్శనల మధ్య ఇక్కడ ఊరేగింపులు వేడుకగా సాగుతాయి.

గుజరాత్లో అయితే ఈ నవరాత్రులలో రోజుకో విధంగా రంగు రంగుల మిర్రర్ బట్టలు ధరించి, గర్బో అని పిలిచే మట్టి కుండ చుట్టూ చేసే గర్బా, దాండియా నృత్యాలు దసరా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిమాచల ప్రదేశ్ కుల్లు దసరా టైమ్‌లో దసరా సమయంలో.. పర్వత ప్రాంతాల నుంచి వందలాది గ్రామ దేవతలను అందమైన పల్లకీలలో దల్పూర్ మైదానానికి తీసుకువచ్చి శ్రీ రఘునాథుడికి నివాళులర్పిస్తారు.

కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది విద్యుత్ దీపాలతో కాంతివంతంగా మెరిసిపోతుంది. బంగారు అంబారీపైన చాముండేశ్వరి అమ్మవారి జంబో సవారీ ఊరేగింపును కళ్లారా చూస్తే జన్మ ధన్యమయినట్లే . అంతేకాకుండా ఇళ్లలో బేసి సంఖ్యలను బేస్ చేసుకుని మెట్లపై బొమ్మలను అమర్చే గొంబే హబ్బ ఆచారం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం.

మహారాష్ట్రలో దసరా నవరాత్రులలో మొదటిరోజే నవధాన్యాలతో ఘటస్థాపన చేసి, దసరా రోజు విజయాభివందనంగా ఆప్తా చెట్టు ఆకులను బంగారంలా భావించి మార్చుకుంటారు.

కేరళలో విజయదశమి రోజు చిన్నపిల్లలతో బియ్యంలో అక్షరాలను రాయిస్తూ విద్యారంభానికి శ్రీకారం చుడతారు. అలాగే రాజస్థాన్ జోధ్‌పూర్‌లో దసరా సమయంలో మార్వార్ ఉత్సవం పేరిట యోధుల శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ జానపద నృత్యాలను ఏర్పాటు చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అయితే ఈ సమయంలో తవాంగ్ ఫెస్టివల్, మిజోరాంలో ఆంథూరియం ప్లవర్స్ ఉత్సవాలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటాయి.


భారత దేశంలోనే కాకుండా నేపాల్‌లో ఏకంగా 15 రోజుల పాటు దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. అక్కడ చిన్న పిల్లలను కుమారీ దేవిగా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. వారి నుదుట జామర అని పిలిచే బియ్యం, పెరుగు, కుంకుమ తిలకాన్ని దిద్ది ఆశీర్వాదాలు ఇస్తారు.

అంతేకాదు బంగ్లాదేశ్‌లో కూడా వేలాది మండపాల్లో దుర్గమ్మని ప్రతిష్ఠించి, ధునుచి నృత్యాలు, సింధూర్ ఖేలా వేడుకలతో దసరా పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. మొత్తంగా దసరా నవరాత్రులను ఎక్కడ ఏ పేరుతో జరుపుకొన్నా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇవి నిలుస్తాయి.






