Just SpiritualLatest News

Varalakshmi Vratam : వరలక్ష్మి దేవి కృపను పొందడం ఎలా? వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి?

Varalakshmi Vratam : శుక్రవారం ఉదయం సూర్యోదయ వేళ వచ్చే సింహ లగ్నంలో కానీ, మధ్యాహ్నం వచ్చే వృశ్చిక లగ్నం లేదా సాయంత్రం వేళ వచ్చే కుంభ లగ్నంలో లక్ష్మీ దేవి పూజను నిర్వహించాలి.

Varalakshmi Vratam

ఇంటికి కళ, మనసుకి ప్రశాంతతతో పాటు అష్టైశ్వర్యాల వెలుగులు ఇచ్చే పండుగ అనగానే ప్రతీ ఒక్కరికీ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గుర్తుకువస్తుంది. సాధారణంగా శుక్రవారాలు, అందులోనూ శ్రావణంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయినా సరే, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి ఉన్న ఆధ్యాత్మిక పవర్ అండ్ ప్రాధాన్యత ఇంకా ఎక్కువ.

కుటుంబ సుఖసంతోషాలతో పాటు, ఐశ్వర్యం, సంతాన భాగ్యం అలాగే ఆయురారోగ్యాల కోసం మహిళలంతా ఎంతో నిష్టతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. కేవలం పూజలకే కాదు.. జ్ఞాన సముపార్జనకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా అందరికీ ఈ మాసం పర్ఫెక్ట్ అని వేదపండితులు చెబుతారు.

వరలక్ష్మి వ్రతం(Varalakshmi Vratam) రోజు వేకువజామునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, మంగళస్నానం చేసి ఇంట గుమ్మానికి తోరణాలు కట్టి.. ముగ్గులతో పెట్టి.. తర్వాత పూజా స్థలాన్ని కూడా అలంకరించుకోవాలి. ఈశాన్య మూల కానీ ఉత్తరం వైపు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కానీ దానికి పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి.

తర్వాత పీఠంపైన బియ్యం పరిచి, దానిపై కలశం ఉంచాలి. కలశంలో నీరు, కొద్దిగా పసుపు, కుంకుమ, నవధాన్యాలు, పువ్వులు, వెండి లేదంటే రాగి నాణాన్ని వేయాలి. కలశంపైన మామిడాకులు అమర్చి, పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకు అమ్మవారి స్వరూపంగా భావించే కలశ వస్త్రాన్ని అలంకరించి, పసుపు లక్ష్మీదేవి రూపాన్ని లేదా వెండి అమ్మవారి ముఖకవచాన్ని అమర్చాలి.

ఇక పూజ ప్రారంభించే ముందు ముందుగా గణనాధుడిని పూజించి, ఆటంకాలు కలగకుండా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసి, అంగపూజ, అష్టోత్తర శతనామావళి, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వరలక్ష్మి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది తోర గ్రంథి పూజ అంటే.. తొమ్మిది దారపు పొరలతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు పూసిన దారానికి పూలు ముడివేసి, పూజలో ఉంచి వరలక్ష అమ్మవారి మంత్రాలతో పూజించాలి. పూజ అయ్యాక ఆ తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి.

తర్వాత పరమాన్నం, దద్దోజనం, పులిహోర, గారెలు, బూరెలు వంటి తొమ్మిది రకాల నైవేధ్యాలతో అమ్మవారికి నివేదించాలి. పూజ ముగిసిన తర్వాత వ్రతకథను చదివి లేదంటే విని అక్షింతలు శిరస్సున ధరించాలి. ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇస్తూ అమ్మవారి స్వరూపంగా భావించి వారి వద్ద ఆశీర్వచనాలు తీసుకుంటే ఆ అమ్మవారి కృపను పొందుతారు.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రవారం ఉదయం సూర్యోదయ వేళ వచ్చే సింహ లగ్నంలో కానీ, మధ్యాహ్నం వచ్చే వృశ్చిక లగ్నం లేదా సాయంత్రం వేళ వచ్చే కుంభ లగ్నంలో లక్ష్మీ దేవి పూజను నిర్వహించడం అత్యంత శుభప్రదంగా వేద పండితులు చెబుతారు. ఉదయాన్నే వీలుపడని వారు సాయంత్రం ప్రదోష కాలంలో కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించొచ్చని అంటారు.

వరలక్ష్మి అంటే కోరిన వరాలు ఇచ్చే దేవతగా భక్తులు నమ్ముతారు. ఈ వ్రతాన్ని నిష్టతో ఆచరించడం వల్ల ధన, ధాన్య, సంతాన, విజయాది అష్టలక్ష్మి దేవుళ్ల అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. మనశ్శాంతితో పాటు ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ శక్తి నిండుతుంది. లక్ష్మి అంటే కేవలం డబ్బు, బంగారం మాత్రమే కాదు.. ఆరోగ్యం, సద్బుద్ధి, జ్ఞానం, ధైర్యం, శుభం కూడా లక్ష్మీ రూపాలే.

Varalakshmi Vratam
Varalakshmi Vratam

అంతేకాదు ఈరోజు మరో ప్రాధాన్యత కూడా ఉంది. ఈరోజు సముద్ర మథనంలో లక్ష్మీదేవి , చంద్రుడు ఆవిర్భవించారని, అందుకే లక్ష్మీదేవికి చంద్రుడికి ప్రత్యేక సంబంధం ఉందని పురాణాలు చెబుతాయి. అలాగే ఇదే పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా కూడా జరుపుతారు.

అలాగే శ్రీమహావిష్ణువు రాక్షసుల నుంచి వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి ఇచ్చిన హయగ్రీవ అవతారాన్ని స్మరిస్తూ కూడా ఈరోజు జ్ఞానం కోసం శ్రీమహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వైదిక సంప్రదాయంలో ఈ రోజు ఉపాకర్మ చేసి గాయత్రీ జపం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని అంటారు.

Fatty Liver : సైలెంట్ కిల్లర్ ఫ్యాటీ లివర్..అరగంట బ్రిస్క్ వాకింగ్‌తో లివర్ సేఫ్‌గా ఉంటుందా?

Related Articles

Back to top button