Archery : ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర..కొరియాను ఓడించి స్వర్ణం కైవసం
Archery : ఫైనల్ పోరులో ఒలింపిక్ విజేతలైన దక్షిణ కొరియా జట్టును భారత ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ జోడీ ఓడించి అగ్రస్థానంలో నిలిచారు
Archery
ఆర్చరీలో ఆధిపత్యం ఎవరిదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కొరియానే… మిగిలిన దేశాలతో పోలిస్తే విలువిద్యలో వారి హవా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఒలింపిక్స్, ఆర్చరీ(Archery)వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో వారి గురి తప్పదు. అలాంటి కొరియాకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆర్చరీ(Archery)ప్రపంచకప్ స్టేజ్-3లో స్వర్ణం గెలుచుకుంది.
మిక్స్ డ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియాను నిలువరించిన భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ జోడీ విజేతగా నిలిచింది. అద్భుత ప్రదర్శన కనబరిచి 5-1 స్కోరుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల ఆరంభం నుంచీ భారత ఆర్చరీ క్రీడాకారులు నిలకడగా రాణిస్తున్నారు. సెమీస్ లోనూ అదిరిపోయే ప్రదర్శనతో బంగారు పతకం కోసం పోటీలో నిలిచినా, ప్రత్యర్థి దక్షిణ కొరియా కావడంతో చాలా మంది రజతానికే ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా ఫైనల్స్ లో భారత జంట చెలరేగిపోయింది.
తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం కనబరిచింది. 37-36 స్కోరుతోనే రెండు రౌండ్లలోనూ గెలిచింది. ఇక మూడో రౌండ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. కొరియన్ జంట పుంజుకుని గట్టిపోటీనిచ్చినా భారత్ ఆర్చర్లు ఒత్తిడికి లోనుకాకుండా చివరి వరకూ మంచి ప్రదర్శన కనబరిచారు. దీంతో స్కోరు 39-39తో సమమైంది. తొలి రెండు రౌండ్లలో సాధించిన ఆధిక్యంతో భారత్ విజేతగా నిలిచింది.
ధీరజ్-కుంకుమ్ జోడీకి ఇదే తొలి ప్రపంచకప్ గోల్డ్ మెడల్. అలాగే భారత్ వరల్డ్ కప్ స్టేజ్ లో స్వర్ణం గెలుచుకోవడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2022 ఈవెంట్ లో రిధి ఫోర్, తరుణ్ దీప్ రాయ్ జోడీ బంగారు పతకం సాధించింది. అప్పటి నుంచి మనకు స్వర్ణం అందని ద్రాక్షగానే మిగిలింది.

ఇప్పుడు ధీరజ్-కుంకుమ్ జోడీ అద్భుత ప్రదర్శనతో స్వర్ణాన్ని అందించింది. ధీరజ్ బొమ్మదేవర ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్మీ ఉద్యోగి అయిన ధీరజ్ గతంలో ఇదే టోర్నీలో కాంస్యం సాధించాడు.
ఇదిలా ఉంటే 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేసిన కుంకుమ్ మొహోద్ గత నెలలో భారత మహిళల జట్టు ప్రపంచ కప్ లో స్వర్ణం గెలవడంలో కీలక పాత్ర పోషించింది. కాగా వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్ లో గెలిస్తే ధీరజ్ కు సింగిల్స్ లో కనీసం రజతం ఖాయమవుతుంది.
Libra :ఈ రాశివారిది శాంతిని కోరుకునే హృదయం..నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు





