Whankade Stadium : వాంఖడే స్టేడియంలో బిగ్ ఫైట్..భారత్ , ఇంగ్లాండ్ బలాబలాలివే
Whankade Stadium : టీ20 ప్రపంచకప్ లో రెండు సెమీఫైనల్స్ లోనూ అత్యుత్తమ జట్లే బరిలో ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటోంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య తొలి సెమీస్ , భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి
Whankade Stadium
టీ20 ప్రపంచకప్‌లో రెండు సెమీఫైనల్స్‌లోనూ అత్యుత్తమ జట్లే బరిలో ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటోంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య తొలి సెమీస్ , భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి. వెస్టిండీస్ పై గెలిచిన తర్వాత సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ కు ఇంగ్లీష్ టీమ్ పై గెలుపు అంత సులభం కాదు.
ఎందుకంటే ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. భారత్ మాత్రం సఫారీల చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్ లూ గెలిచినా, సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓడి జింబాబ్వే, విండీస్ లపై గెలిచింది. అటు గ్రూప్ 2లో శ్రీలంక , పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను ఓడించిన ఇంగ్లాండ్.. టాపర్ గా సెమీస్ కు చేరింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్ గా భావిస్తున్నా.. సొంతగడ్డపై ఆడనుండడంతో పాటు గత రికార్డులు కూడా టీమిండియా వైపే ఉన్నాయి.
వాంఖడే స్టేడియం(Whankade Stadium) వేదికగా జరగబోయే ఈ బిగ్ ఫైట్ లో భారత జట్టుకు సంబంధించి పలువురు కీలక ఆటగాళ్లపైనే గెలుపు ఆధారపడి ఉంది. ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్, తిలక్ వర్మ మెరుపులకు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ తో పాటు స్లాగ్ ఓవర్లలో హార్థిక్ పాండ్యా ధనాధన్ తోడైతే తిరుగుండదు.
అటు బౌలింగ్ లో బుమ్రాతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కలిసికట్టుగా రాణించాల్సిందే. ఇక హార్థిక్, దూబేలు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయకపోతే కష్టాలు తప్పవు. దీని ప్రకారం చూస్తే బ్యాటింగ్ లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్… బౌలింగ్ లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి కీలకం కాబోతున్నారు.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టులోనూ కొంతమంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారిని కట్టడి చేయకపోతే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ , హ్యారీ బ్రూక్ , సామ్ కరన్, విల్ జాక్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా విల్ జాక్స్ ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయాల్లో కీలకంగా మారిపోయాడు. అటు బౌలింగ్ లో ఆర్చర్, ల్యూక్ వుడ్ కూడా ఫామ్ అందుకున్నారు. వీరు రాణించడంపైనే ఇంగ్లాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ సెమీస్ లో తలపడనుండడం ఇది వరుసగా మూడోసారి. 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేయగా.. తర్వాత 2024 ప్రపంచకప్‌లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లడమే కాకుండా ట్రోఫీని కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ గత రికార్డుల్లో మాత్రం ఇంగ్లాండ్ దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడగా, ఇంగ్లాండ్ 3 సార్లు, భారత్ 2 సార్లు గెలిచాయి. మరి వాంఖడే స్టేడియం(Whankade Stadium) వేదికగా జరగబోయే ఈ బిగ్ ఫైట్ లో ఎవరు విజేతలు అవుతారో వేచి చూడాల్సిందే.



