Just SportsLatest News

Rajasthan Royals : రాజస్థాన్ ఈసారైనా ?…రెండో టైటిల్ కోసం నిరీక్షణ

Rajasthan Royals : ఐపీఎల్ ఆరంభ సీజన్ లోనే సంచలన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకర్షించిన జట్టు రాజస్థాన్ రాయల్స్... ఒకరిద్దరు తప్పిస్తే మిగిలిన వారంతా అనామకులే

Rajasthan Royals

ఐపీఎల్ ఆరంభ సీజన్ లోనే సంచలన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకర్షించిన జట్టు రాజస్థాన్ రాయల్స్… ఒకరిద్దరు తప్పిస్తే మిగిలిన వారంతా అనామకులే.. అలాంటి యువ బలంతోనే 2008లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) దుమ్మురేపింది. సంచలన విజయాలతో ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. కానీ తర్వాతి సీజన్లలో మాత్రం నిరాశపరుస్తూ వస్తోంది. ఆ తర్వాత జరిగిన 17 సీజన్లలో కేవలం మూడుసార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ వరకూ వచ్చిన రాయల్స్ 2022లో ఫైనల్ దాకా వెళ్లినప్పటికీ టైటిల్ అందుకోలేకపోయింది.

గత ఏడాది అత్యంత చెత్త ప్రదర్శనతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్ లో సంజూ శాంసన్ కొన్ని మ్యాచ్ లకు దూరమవడం, కెప్టెన్సీ మార్పు వంటివి ప్రభావం చూపించాయి. 2025 సీజన్ ముగిసిన తర్వాత కోచ్ గా రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. సంజూ శాంసన్ ను ట్రేడింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చేసిన రాజస్థాన్ రాయల్స్ బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది.

ఇప్పుడు ద్రావిడ్ స్థానంలో కుమార సంగక్కర కోచ్ గా, సంజూ శాంసన్ ప్లేస్ లో రియాన్ పరాగ్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నారు. గత సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ సరిగ్గా రాణించలేదు. అందుకే వారందరినీ వదులుకుని యువ క్రికెటర్లను తీసుకుంది.

రాయల్స్ బ్యాటింగ్ విషయానికొస్తే స్వదేశీ, విదేశీ హిట్టర్లతో కళకళలాడుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ మెరుపు ఆరంభాలతో ప్రత్యర్థి బౌలర్లు చుక్కలు చూడటం ఖాయం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గత సీజన్ లో ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడాడో అందరూ చూసారు.

దీంతో మరోసారి ఈ చిచ్చరపిడుగుపైనే అందరి దృష్టి ఉంది. అటు రియాన్ పరాగ్ గత సీజన్ లో ఫ్లాప్ అయ్యాడు. ఈ సారి కెప్టెన్సీ ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో ఎలా రాణిస్తాడో చూడాలి. జురెల్ కూడా రాజస్థాన్ బ్యాటింగ్ కు బలం. అలాగే హిట్ మెయిర్, లువాన్ ప్రిటోరియస్ వంటి ప్లేయర్లతో మరింత పటిష్టంగా కనిపిస్తోంది.

Rajasthan Royals
Rajasthan Royals

హిట్ మెయిర్ రాయల్స్ కు ఫినిషర్ కానున్నాడు. అతనితో పాటు జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాపైనా అంచనాలున్నాయి. ఆల్ రౌండర్ గా జడ్డూ ఎంతవరకూ రాజస్థాన్ కు ఉపయోగపడతాడో చూడాలి. ఎందుకంటే గత రెండు సీజన్లుగా జడేజా ఐపీఎల్ కెరీర్ తన స్థాయికి తగినట్టు లేదు. అటు సామ్ కరన్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోవడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలో కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి.

గత సీజన్ లో నిరాశపరిచిన జోఫ్రా ఆర్చర్ ఈ సారి ఎంతవరకూ రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మిల్నే, బర్గర్, మఫాకా లాంటి విదేశీ బౌలర్లు ఉన్నా ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి. అటు సందీప్ శర్మకు తోడుగా ప్రభావం చూపించే భారత పేసర్ లేకపోవడం రాయల్స్ కు ఇబ్బందే. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ పైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. కెప్టెన్ పరాగ్ తన స్లో బౌలింగ్ తో వికెట్లు తీయగలిగితే రాజస్థాన్ కు అడ్వాంటేజ్ అవుతుంది.

CSK : చెపాక్ లో గర్జించిన దిగ్గజాలు.. సీఎస్కే మాజీల ఎగ్జిబిషన్ మ్యాచ్

Related Articles

Back to top button