SRH : సన్ ”రైజ్” అయ్యేనా ?..మళ్లీ బలహీనంగానే బౌలింగ్
SRH : ఐపీఎల్ వస్తుందంటే టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్స్ అది కూడా విధ్వంసకర బ్యాటర్లు ఉండడమే దీనికి కారణం
SRH
ఐపీఎల్ వస్తుందంటే టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్స్ అది కూడా విధ్వంసకర బ్యాటర్లు ఉండడమే దీనికి కారణం. గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏంటనేది అభిమానులు దగ్గరగా చూశారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్.. ఇలాంటి టీ20 హిట్టర్స్ అందరూ ఈ జట్టులోనే ఉన్నారు.
అందుకే గత సీజన్లలో సన్ రైజర్స్(SRH) రికార్డు స్థాయిలో స్కోర్లు నమోదు చేసింది. సీజన్ లో అత్యధికంగా 250 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. కానీ క్రికెట్ లో కేవలం బ్యాటింగ్ తోనే విజయాలు రావు. బౌలింగ్ కూడా బాగుంటేనే మ్యాచ్ లు గెలుస్తారు. బ్యాటింగ్ లో సూపర్ హిట్ గా కనిపించిన సన్ రైజర్స్ బౌలింగ్ లో మాత్రం బలహీనంగా మారింది. ఈ కారణంగానే గత సీజన్ లో లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. ఈ సారి కూడా బౌలింగ్ వీక్ నెస్ వెంటాడుతోంది.
పలువురు బౌలర్లు గాయాలతో దూరమవడం కూడా ఇబ్బందిగా మారింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో సగం మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో కమ్మిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ అప్పగించిన సన్ రైజర్స్ యాజమాన్యం అభిషేక్ శర్మను అతనికి డిప్యూటీగా నియమించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్ఖండ్ ను ఛాంపియన్ గా నిలిపిన ఇషాన్ కిషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకుని ఆరెంజ్ ఆర్మీని ఈ యువ ఆటగాడు ఎలా నడిపిస్తాడో చూడాలి.

నిజానికి మినీ వేలంలో సన్ రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది. రూ.25.5 కోట్ల భారీ పర్స్ తో వేలానికి వెళ్లిన కావ్యా మారన్ సరైన ప్లేయర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది. ప్రధాన ఆటగాళ్ళందరినీ రిటైన్ చేసుకున్నా సరే బ్యాకప్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. జట్టు బలహీనతలపైనా దృష్టి సారించలేదు.
బౌలింగ్ లో మహ్మద్ షమీని భర్తీ చేయలేకపోయింది. చాలా మొత్తం చేతిలో ఉన్నా స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకోలేకపోయింది. రవి బిష్ణోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివర్లో వదిలేసింది. అనామక ఆల్ రౌండర్ల కోసం గట్టిగానే పోరాడినా వారిని దక్కించుకోలేకపోయింది. ఆశ్చర్యకరంగా ఆర్సీబీ వదిలేసి, అన్ సోల్డ్ గా మిగిలిన లివింగ్ స్టోన్ కోసం ఏకంగా 13 కోట్లు వెచ్చించింది.
జాక్ ఎడ్వర్డ్స్ ను 3 కోట్లకు తీసుకోగా అతను గాయంతో దూరమయ్యాడు. మొత్తం మీద గత సీజన్ లో ఉన్న బౌలింగ్ బలహీనతే ఇప్పుడు కూడా సన్ రైజర్స్ కు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్ తో ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
RCB : ఇప్పుడే మనకు అసలు పరీక్ష..ఆర్సీబీ ప్లేయర్స్ కు కోహ్లీ హెచ్చరిక





