Just SportsLatest News

PBKS vs DC : పంజాబ్ గెలుపు బాట పట్టేనా ?..ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

PBKS vs DC : పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న 55వ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారనుంది

PBKS vs DC

ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. సీజన్ సెకండాఫ్ లో తడబడుతున్న పంజాబ్ , ఢిల్లీ క్యాపిటల్స్(PBKS vs DC) తో తలపడబోతోంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టి టాప్ ప్లేస్ లో నిలిచిన పంజాబ్ కింగ్స్ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది.

గత మూడు మ్యాచ్ లలోనూ పరాజయం పాలైంది. 10 మ్యాచ్ లలో ఆరు గెలిచి 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఢిల్లీపై గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళుతుంది. సన్ రైజర్స్ పై పంజాబ్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలే కారణం. సన్ రైజర్స్ బ్యాటర్లు ఇచ్చిన పలు క్యాచ్ లను పంజాబ్ ఫీల్డర్లు జారవిడిచారు.

అంతకుముందు మ్యాచ్ లలోనూ చెత్త ఫీల్డింగే పంజాబ్ కొంపముంచింది. దీనిపై కోచ్ రికీ పాంటింగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ మెరుగుపడకుంటే మాత్రం పంజాబ్ కు ఇబ్బందే. అటు బ్యాటింగ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ , శ్రేయాస్ అయ్యర్ , స్టోయినిస్ గత మ్యాచ్ లో విఫలమయ్యారు.

కూపర్ కన్నోలీ సెంచరీతో చెలరేగినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. దీంతో బ్యాటర్లు కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో మార్కో జెన్సన్ , విజయ్ కుమార్ వైశాక్ తో పాటు ఫెర్గ్యుసన్, అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. అయితే స్లాగ్ ఓవర్లలో పరుగులు ఇచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాహల్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కథ దాదాపుగా ముగిసినట్టే. ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ కేవలం నాలుగే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఆ జట్టు మిగిలిన మూడింటిలో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే, ఎందుకంటే నెగెటివ్ రన్ రేట్ ను బాగా మెరుగుపరుచుకోవాలంటే మూడు మ్యాచ్ లలో భారీ విజయాలను అందుకోవాలి.

PBKS vs DC
PBKS vs DC

మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. నిజానికి ఈ సీజన్ లోనూ ఢిల్లీ బలహీనత మరోసారి బయటపడింది. ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టి కీలకమైన సెకండాఫ్ లో చేతులెత్తేసింది. నిలకడ లేని బ్యాటింగ్, బలహీనమైన బౌలింగ్ ఢిల్లీ ఓటములకు కారణంగా చెప్పొచ్చు. మిఛెల్ స్టార్క్ వచ్చిన తర్వాత బౌలింగ్ పరంగా మెరుగ్గానే ఉన్నా మిగిలిన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు.

బ్యాటింగ్ లో నిస్సాంక, రాహుల్, నితీశ్ రాణా , స్టబ్స్ వంటి వారున్నా నిలకడగా రాణించడం లేదు. సమీర్ రిజ్వీ రెండు మ్యాచ్ లు గెలిపించిన తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఈ నేపథ్యంలో పటిష్టమైన పంజాబ్ ను ఓడించాలంటే ఢిల్లీ అంచనాలకు మించి రాణించాల్సిందే.

Modi : బంగారం కొనొద్దు..ప్రధాని మోదీ సంచలన పిలుపు

Related Articles

Back to top button