Harmanpreet Kaur : ఐదోసారి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్..టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఇదే
Harmanpreet Kaur : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు
Harmanpreet Kaur
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)లతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
రికార్డు స్థాయిలో ఐదోసారి హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) వరల్డ్ కప్ లో టీమ్ ను నడిపించనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని 15 మందితో పటిష్టమైన జట్టును ఎంపిక చేశారు. అయితే గాయాలతో పలువురు స్టార్ ప్లేయర్స్ ఈ మెగాటోర్నీకి దూరమయ్యారు. అమన్ జోత్ కౌర్, హ్యార్లిన్ డియోల్ , స్నేహా రాణా గాయాల నుంచి కోలుకోకపోవడంతో చోటు దక్కలేదు.
అమన్ జోత్ స్థానంలో భారతి పుల్మాలికి చోటు దక్కింది. బ్యాటింగ్ లో హర్మన్ ప్రీత్ తో పాటు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిఛా ఘోష్ కీలకం కానున్నారు. ఆల్ రౌండర్ కోటాలో దీప్తి శర్మకు చోటు దక్కగా.. బౌలింగ్ ఎటాక్ ను సీనియర్ పేసర్ రేణుకా సింగ్ లీడ్ చేయనుంది. ఈ వరల్డ్ కప్ జట్టులో ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు లభించింది.
శ్రీచరణి, అరుంధతి రెడ్డిలు మెగాటోర్నీకి ఎంపికయ్యారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ విజయంలో వీరు కీలకపాత్ర పోషించారు. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని పేసర్ నందిని శర్మకు చోటు లభించింది. అలాగే గాయం నుంచి కోలుకున్న యాస్తికా భాటియా జట్టులోకి తిరిగి వచ్చింది.

ఇదిలా ఉంటే మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా… గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్,బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ , స్కాట్లాండ్ చోటు దక్కించుకున్నాయి.
టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 30న తొలి సెమీఫైనల్, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది. ఇక గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. దీంతో పొట్టి ప్రపంచకప్ పైనా భారత జట్టుపై అంచనాలు పెరిగాయి.
Cheque Bounce : చెక్ మీద సంతకం పెట్టారా ?..ఈ తప్పులు చేస్తే జైలుకే





