Chepa Prasadam : చేప ప్రసాదం పంపిణీకి కౌంట్ డౌన్..మోసగాళ్లపై నిర్వాహకుల హెచ్చరిక
Chepa Prasadam : ఈ ఏడాది మృగశిర కార్తె సమయ వేళల్లో వచ్చిన మార్పుల వల్ల, జూన్ 8వ తేదీ సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఈ చేపమందు పంపిణీ ప్రక్రియ అఫీషియల్‌గా ప్రారంభం కానుంది
Chepa Prasadam
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బత్తిని కుటుంబీకుల చేప ప్రసాదం(Chepa Prasadam) పంపిణీకి సర్వం సిద్ధమైపోయింది. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడేవారి కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ ఏడాది మృగశిర కార్తె సమయ వేళల్లో వచ్చిన మార్పుల వల్ల, జూన్ 8వ తేదీ సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఈ చేపమందు(Chepa Prasadam) పంపిణీ ప్రక్రియ అఫీషియల్‌గా ప్రారంభం కానుంది. మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ మంగళవారం రాత్రి వరకు ఎలాంటి విరామం లేకుండా 24 గంటల పాటు కంటిన్యూగా ఈ ప్రసాదాన్ని అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
దాదాపు 180 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాద(Chepa Prasadam) పంపిణీ కార్యక్రమం.. గతంలో పాతబస్తీలో నిర్వహించేవారు. అయితే భద్రతా కారణాలు, జనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి మార్చారు.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు ఒకట్రెండు రోజుల ముందే హైదరాబాద్‌కి చేరుకుంటారు. ఈసారి వస్తున్న భారీ జనాన్ని తట్టుకోవడానికి క్యూ లైన్లలో.. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా అధికారులతో కలిసి మైదానాన్ని సందర్శించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. మత్స్యశాఖ ద్వారా సుమారు 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు , సీపీఆర్ టీమ్‌ను కూడా రంగంలోకి దించారు.
ఈ సందర్భంగా క్యూ లైన్లలో ఉండే అమాయక ప్రజలను మాటల్లో పెట్టి , చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేస్తామంటూ డబ్బులు వసూలు చేసే మోసగాళ్లు తిరుగుతున్నారని నిర్వాహకులు చెప్పారు. అలాంటి వారిని అస్సలు నమ్మొద్దని హెచ్చరించారు.
ఈ ప్రసాదాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు అప్పగించాలని చెప్పారు. కేవలం ఇక్కడికి వచ్చిన వారికి మాత్రమే ప్రసాదం ఇస్తారని, పార్సిల్స్ కానీ హోమ్ డెలివరీలు కానీ ఉండవని తేల్చి చెప్పారు.

ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం.. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రసాదం తీసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆ తర్వాత 3,4 రోజుల పాటు కవాడిగుడాలోని తమ సొంత ఇంటి వద్ద కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవచ్చని భరోసా ఇచ్చారు.
ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి సౌకర్యం కోసం జీహెచ్‌ఎంసీతో పాటు తెలంగాణ అగర్వాల్ సమాజ్ వంటి కొన్ని వెల్ఫేర్ సంస్థలు ఫ్రీగా తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, భోజన వసతులను కల్పిస్తున్నాయి.
ట్రాన్స్ పోర్ట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది. ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, నిర్వాహకులు , ఎన్జీఓలు కలిసి సంయుక్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Lunch : లంచ్ ఐదు నిమిషాల్లో ముగిస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!





