Just TelanganaJust PoliticalLatest News

GHMC:హైదరాబాద్‌ ఇక త్రిశూలం.. మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన

GHMC: ఇప్పటివరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను కూడా మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

GHMC

హైదరాబాద్ నగర పాలనలో..రేవంత్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక విప్లవానికి తెరలేపింది. పెరిగిపోతున్న జనాభాతో పాటు విస్తరిస్తున్న సిటీని దృష్టిలో ఉంచుకుని, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యం పెట్టుకుంది.

దీనికోసం ఇప్పటివరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను కూడా మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీనిపై రేవంత్ సర్కార్ జీఓ 55ను విడుదల చేసింది. ఇకపై హైదరాబాద్ జీహెచ్‌ఎంసీతో పాటుగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అలాగే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)ల పరిధిలోకి వస్తుంది.

పరిపాలన సౌలభ్యం కోసం ఈ మూడు సంస్థలకు గవర్నెమెంట్ వెంటనే కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా, సైబరాబాద్ కమిషనర్‌గా సృజన , మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మూడు విభాగాలకు స్పెషల్ ఆఫీసర్‌గా.. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పర్యవేక్షణ చేయబోతున్నారు.

అంతేకాదు ఈ విభజన ప్రకారం ఏ ప్రాంతం ..ఏ కార్పొరేషన్ కిందకు వస్తుందో కూడా రేవంత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలుఎప్పటిలాగా జీహెచ్‌ఎంసీ( GHMC) పరిధిలో ఉంటాయి. దీని ఆఫీసు కూడా ప్రస్తుతం ఉన్న లోయర్ ట్యాంక్ బండ్ బిల్డింగ్‌లోనే కొనసాగుతుంది.

GHMC
GHMC

ఇక ఐటీ రంగానికి నిలయమైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి , కుత్బుల్లాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ఆఫీసు మాదాపూర్‌లోని నాక్ భవనంలో ఉంటుంది.

ఇక ఎల్బీనగర్, ఉప్పల్ , మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించింది. దీని ఆఫీసు తార్నాకలోని హుడా భవనంలో ఉండనుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా వార్డుల సంఖ్యను కూడా గవర్నమెంట్ 300లకు పెంచింది. దీనివల్ల నిధుల కేటాయింపు , సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button