Shilparamam : వీకెండ్ బెస్ట్ స్పాట్.. సిటీ మధ్యలో ఓ చల్లని సాయంత్రాన్ని ఆస్వాదించండి
Shilparamam : భాగ్యనగరానికి ఎవరు వచ్చినా సరే మస్ట్‌గా చూడాల్సిన ప్లేస్ శిల్పారామం. హస్తకళలకు కేరాఫ్‌గా నిలుస్తూ, గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ అన్ని ఏజ్ల వారినీ అలరిస్తుంది
Shilparamam
హైటెక్ హంగులతో పర్యాటకులను ఆకట్టుకోవడంలో భాగ్యనగరం ఎప్పుడూ ముందే ఉంటుంది. టెకీలకు, సిటీవాసులకు ఫేవరేట్ స్పాట్‌గా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఎప్పుడూ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చే సిటీగా హైదరాబాద్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది.
పోష్ సిటీగా యూత్‌ను ఎంతలా అట్రాక్ట్ చేస్తుందో, ఎక్కడికక్కడ పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ పెద్దవాళ్లను కూడా అంతే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని నగరానికి గుండెకాయ వంటి హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం(Shilparamam).. ఓ వైపు పచ్చదనం, మరోవైపు పల్లెదనంతో పర్యాటకుల్ని కట్టిపడేస్తోంది. బిజీబిజీ పనులతో అలసిపోయిన నగర జీవికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శిల్పారామం ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ అన్నట్లే ఉంటుంది.
భాగ్యనగరానికి ఎవరు వచ్చినా సరే మస్ట్‌గా చూడాల్సిన ప్లేస్ శిల్పారామం(Shilparamam). హస్తకళలకు కేరాఫ్‌గా నిలుస్తూ, గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ అన్ని ఏజ్ల వారినీ అలరిస్తుంది. కలర్‌ఫుల్ లైటింగ్‌లతో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దొరికే అన్ని రకాల వస్తువులతో పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ఇక్కడి వాల్ పెయింటింగ్స్, ఫ్లవర్ వాజ్‌లు, ట్రెడిషనల్ ఆర్నమెంట్స్, ముత్యాలు, వుడెన్ ఫర్నిచర్, వెరైటీ డ్రెస్సులు షాపింగ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం(Shilparamam)ను 1998 జూన్ 21న ప్రారంభించారు. శిల్పారామం కేవలం హస్తకళలకే కాకుండా దేశంలోని వివిధ ప్రాచీన కళలకి ప్రాముఖ్యత ఇచ్చిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. భారత దేశంలోని కళల సంప్రదాయాలను రక్షించే అద్భుతమైన ఆలోచనతో ఇది ఏర్పాటైంది.
రకరకాల చెట్లు, పూదోటల పచ్చదనంతో పర్యాటకుల మనసు దోచేస్తుంది. ఏడాది పొడవునా సంప్రదాయక పండుగలను ఈ శిల్పరామంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగల వల్ల మన దేశంలోని వివిధ హస్త కళల గురించి నేటి తరానికి తెలియడమే కాకుండా, ప్రాచీన కళలను సంరక్షించే అవకాశం కూడా లభిస్తుంది.
ఇక్కడ లభించే రక రకాల బట్టలు, కలంకారి డిజైన్లు, గుజరాత్‌కు సంబంధించిన ఫేమస్ వెరైటీలు, ఎంబ్రాయిడరీ వర్క్స్, చేతితో ఎంతో చక్కగా చెక్కబడిన కళాకృతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఒడిశా, రాజస్థాన్ వంటి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫర్నిచర్, అలాగే చేతితో చేసిన పెయింట్ బాటిల్స్ వంటి ఎన్నో రకాల వస్తువులు చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. అంతేకాదు ఎక్కడా లేని కొత్త కొత్త కలెక్షన్స్‌తో ఫ్యాషన్ లవర్స్ మనసును ఈజీగా దోచే షాపింగ్ ఇదే అన్నా కూడా అతిశయోక్తి కాదు.
అలాగే శిల్పారామంలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన లెదర్ పప్పెట్ మ్యూజియం పెద్దల నుంచి చిన్నపిల్లల వరకూ అందరినీ కట్టిపడేస్తోంది. వినాయకుడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వంటి ఇతిహాస పాత్రల చిత్రాలు లైటింగ్‌ల మధ్య కనువిందు చేస్తుంటాయి.

దీనికితోడు ఎప్పుడో కనుమరుగు అయిపోయిన తోలుబొమ్మలాట ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. ఇక్కడున్న విలేజ్ మ్యూజియం కూడా ఈ తరానికి ఎన్నో తెలీని గ్రామీణ విషయాలను నేర్పిస్తుంది. మన ప్రాచీన చేతి వృత్తులపైన ఆధారపడి జీవించేవారిని, వారి లైఫ్ స్టైల్‌ను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. అక్కడ ఉన్నవి బొమ్మలు అంటే ఎవరూ నమ్మలేనంత నేచురల్‌గా అవి కనిపిస్తుంటాయి.
చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా వీకెండ్స్‌లో హ్యాపీగా రిలాక్స్ అవడానికి.. శిల్పరామం ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పొచ్చు. సందర్శకుల మనసును దోచేలా ఇక్కడి కొలనులో బోటింగ్, ప్రక్కనే వాటర్ ఫౌంటైన్ వివిధ లైటింగ్స్ మధ్య కనువిందు చేస్తుంటాయి.
మొత్తంగా పచ్చటి లాన్స్‌తో నిండిన శిల్పరామంలో ఓ చల్లని సాయంత్రం ఫ్యామిలీతోనో లేదా ఫ్రెండ్స్తోనో గడిపారంటే, మీ అలసట, బోరింగ్ అంతా ఉఫ్ మని ఊదేసినట్లవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.





