Kalvakuntla Kavitha : టీఆర్ఎస్ పార్టీ పేరుతో కల్వకుంట్ల కవిత రీ ఎంట్రీ.. బీఆర్ఎస్ పునాదులు కదిలిస్తుందా?
Kalvakuntla Kavitha : తెలంగాణ ప్రజల్లో టీఆర్‌ఎస్ అనే అక్షరాలకు ఉన్న ఆదరణతో పాటు సెంటిమెంట్ వెలకట్టలేనివి. బీఆర్‌ఎస్ అని పేరు మార్చిన తర్వాత పార్టీకి ,ఉద్యమ మూలాలకు మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడిందన్న విమర్శలు వినిపించాయి.
Kalvakuntla Kavitha
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు ఉద్యమకారిణిగా, ఎంపీగా, అంతకంటే ఎక్కువగా కేసీఆర్ గారాల పట్టిగా తనదైన ముద్ర వేసిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), ఇప్పుడు తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పాత సెంటిమెంట్ టీఆర్‌ఎస్ పేరుతో సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన కవిత, రాజకీయ ప్రస్థానంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2024లో ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు కావడం, ఆ తర్వాత బీఆర్‌ఎస్ (BRS) నాయకత్వంతో వచ్చిన విభేదాలు, దాని ప్రభావం కుటుంబంలో కూడా పడటం వంటి పరిస్థితులు.. కవిత స్వతంత్ర రాజకీయ అడుగుల వైపు నడిచేలా చేశాయి. కేసీఆర్ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత మరుగున పడిపోయిన తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ వెలికితీయడానికే ఆమె పాత పేరు టీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి తెలంగాణ ప్రజల్లో టీఆర్‌ఎస్ అనే అక్షరాలకు ఉన్న ఆదరణతో పాటు సెంటిమెంట్ వెలకట్టలేనివి. బీఆర్‌ఎస్ అని పేరు మార్చిన తర్వాత పార్టీకి ,ఉద్యమ మూలాలకు మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడిందన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు కేసీఆర్ ఆ పేరును మార్చక ముందే .. కాస్త ముందే అలర్ట్ అయిన కవిత టీఆర్ఎస్ పేరుతో ముందుకు రావడంతో, తానే అసలైన ఉద్యమ వారసురాలిని అని చాటిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇక 2026 ఏప్రిల్ 24న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సాక్షిగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సేన (TRS) తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌కు మార్చే ఆలోచనలో ఉన్న సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా కవిత(Kalvakuntla Kavitha) టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అలాగే ఈ సభలో ఆవిష్కరించిన పార్టీ జెండా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గులాబీ రంగుకు పూర్తిగా స్వస్తి చెప్పి.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కవిత ఎంచుకోవడం ద్వారా రైతులు, బడుగు బలహీన వర్గాలు ,సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు.
కాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలంగా సాగిన మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పాత్ర అసామాన్యం. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన కవిత, సాంస్కృతిక సారథిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే పునాదిగా, మహిళా సాధికారత, యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా కవిత కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తన ప్రధాన రాజకీయ శత్రువుగా ప్రకటించడమే కాదు, తన సొంత గూడైన బీఆర్‌ఎస్‌ను ధనిక పార్టీగా విమర్శించి తన పొలిటికల్ స్ట్రాటజీకి పదును పెట్టడం ప్రారంభించారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న త్రిముఖ పోటీలో..ఇప్పుడు టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రవేశం నాలుగో శక్తిగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లోని ఉద్యమకారులు, సెకండ్ లైన్ లీడర్లు కేసీఆర్ తనయ కవిత వైపు మళ్లే అవకాశం ఉంది. ఇది బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును భారీగానే దెబ్బతీస్తుంది. అలాగే తెలంగాణ జాగృతి ద్వారా మహిళల్లో ఉన్న గుర్తింపు వల్ల కవితకు ఈ పార్టీ ప్లస్ పాయింట్ కాబోతుంది.
Energy Drink : ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ ఎనర్జీ డ్రింక్.. అస్సలు లైట్ తీసుకోకండి..





