SIT : బండి కుమారుడిపై కేసు..సిట్ తో విచారణకు సీఎం ఆదేశం
SIT : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది
SIT
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై కేసు వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా కేసు నమోదు చేసే విషయంలో ఆలస్యం జరగడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మే 8న ఫిర్యాదు అందినా ఎందుకు వెంటనే స్పందించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై డీజీపీ సీవీ ఆనంద్ ను ప్రశ్నించగా… ప్రధాని మోదీ పర్యటనకు భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల ఫిర్యాదు తీసుకోవడం ఆలస్యమైందని ఆయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. కేసు దర్యాప్తుపై వెంటనే సిట్(SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని డీజీపీకి ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ విమర్శలు, మైనర్ బాలిక అంశం కావడంతో ఈ విచారణలో చట్టపరంగా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని డీజీపీకి(SIT) ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ సీవీ ఆనంద్ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. ఈ ప్రత్యేక బృందం ప్రధానంగా బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించడంతో పాటు కీలక సాక్ష్యాధారాలు సేకరించి నివేదికను ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేసు ముందుకు సాగనుంది.
17 ఏళ్ల మైనర్ బాలికను మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి బండి భగీరథపై ఫిర్యాదు చేసారు. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75, పోక్సో చట్టం సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్ లో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
బలవంతంగా మద్యం తాగించి బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగానే మనస్తాపానికి గురైన బాలిక రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసిందని ఆమె తల్లి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ కేసు నమోదు చేసేందుకు కొన్ని గంటల ముందు బండి భగీరథ బాలిక, ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనపై హానీ ట్రాప్ కు పాల్పడ్డారనీ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ బ్లాక్ మెయిల్ చేసారని ఫిర్యాదులో భగీరథ పేర్కొన్నారు.

దీని కోసం తీవ్ర ఒత్తిడి చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపించారు. తాను రూ.50 వేలు ఇచ్చినట్టు కూడా ఫిర్యాదులో తెలిపారు. దీంతో బాలిక కుటుంబం పైనా వేరే కేసు నమోదైంది. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేంద్రమంత్రి కొడుకును కాపాడేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయారనీ, మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నారనీ బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను బండి సంజయ్ కుట్రగా అభివర్ణించారు. మోదీ పర్యటనకు ముందు తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.
Draupadi:విదేశాల్లోనూ ద్రౌపదిని ఆరాధిస్తారని తెలుసా? ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఇవే..





