Just PoliticalJust Telangana

Telangana politics:తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ వర్సెస్ కవిత

Telangana politics:కేటీఆర్ వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడంతో, ఇప్పుడు కవిత స్వయంగా బరిలోకి దిగారు. 'అన్నలాగే ఆమె కూడా సీఎం రేవంత్ రెడ్డికే బహిరంగ చర్చపై సవాల్ విసిరారు.

Telangana politics: తెలంగాణ రాజకీయం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. రైతులకు ఎవరు ఏం చేశారు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్, ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి పాకుతూ, అనూహ్య మలుపులు తిరుగుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్‌ను స్వీకరించి, జూలై 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని టైమ్ ఫిక్స్ చేశారు. తీరా చూస్తే, ఆ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగింది.

సీఎం రేవంత్ రెడ్డికి సవాల్..

కేటీఆర్ వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడంతో, ఇప్పుడు కవిత స్వయంగా బరిలోకి దిగారు. ‘అన్నలాగే ఆమె కూడా సీఎం రేవంత్ రెడ్డికే బహిరంగ చర్చపై సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీల’ అమలుపై, ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఇతర సంక్షేమ పథకాల అమలు వైఫల్యాలను హైలెట్ చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి కార్యకర్తల సమావేశంలో ..రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ రాజకీయాలు’ చేస్తున్నారని, కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, మహిళల హక్కుల కోసం చర్చించడానికి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు మహిళలతో వచ్చి మాట్లాడాలంటూ కవిత సవాల్ విసిరారు.

ఆ ఐదు గ్రామాల కోసం ఏపీ సీఎంకు లేఖ ..

కేవలం ఎన్నికల హామీలపైనే కాదు, కవిత మరో కీలక అంశాన్ని తెరపైకి తెచ్చారు. భద్రాచలం దేవస్థానం పరిధిలోని ఐదు గ్రామాలు (సుమారు 1,000 ఎకరాల ఆలయ భూములతో సహా) ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాస్తున్నట్లు ప్రకటించారు.

ఈ గ్రామాల విలీనం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా జరిగినప్పటికీ, కవిత దీనిని తెలంగాణ ప్రజల స్వాభిమానంతో ముడిపడిన అంశంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు, నీటి వనరులు, ఇతర విషయాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు కొనసాగుతున్న ఈ సమయంలో, కవిత ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని కాపాడే నాయకురాలిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహంగా కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం కవిత ‘గేమ్ చేంజర్ అవనున్నారా?
కవిత సవాల్, ఐదు గ్రామాల డిమాండ్… ఇవన్నీ బీఆర్‌ఎస్ రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో వచ్చాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి తర్వాత, బీఆర్‌ఎస్ తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. కవిత తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ, ప్రజల్లో తమ పార్టీ ఇమేజ్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజల అసంతృప్తిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

సమన్వయం కుదురుతుందా? మరింత వివాదం రేగుతుందా?
రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తుల విభజన, నీటి వనరులు, ఇతర సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జూలై 6న హైదరాబాద్‌లో సమావేశమై, విభజన సమస్యలను పరిష్కరించడానికి రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, కవిత ఇప్పుడు ఐదు గ్రామాల ‘డీమెర్జర్’ డిమాండ్‌ను లేవనెత్తడం, ఈ చర్చలను మరింత సంక్లిష్టం చేయవచ్చు. ఎందుకంటే, గ్రామాల విలీనం అనేది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, చట్టపరంగా కూడా చాలా సున్నితమైన విషయం.మరి కవిత సవాల్‌ను రేవంత్ రెడ్డి ఎలా స్వీకరిస్తారు? ఐదు గ్రామాల డిమాండ్ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది? తెలంగాణ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి? వేచి చూడాలి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button