gun threat:తుపాకీ ముప్పులో తెలంగాణ
gun threat:తెలంగాణలో భగ్గుమంటున్న తుపాకీ సంస్కృతి: మూడు రోజులు.. మూడు ఘటనలు..

gun threat:తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల్లో మూడు కాల్పుల ఘటనలు జరగడం మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా, ఈ ఘటనలన్నీ పొలిటికల్ లీడర్స్ చుట్టూ తిరగడం గన్ కల్చర్ డెన్సిటీని చెప్పకనే చెబుతోంది.
Telangana under gun threat
ఈరోజు మలక్‌పేట్‌లో సీపీఐ నాయకుడి హత్య, మెదక్‌లో కాంగ్రెస్ నేత హత్య జరగడంతో తెలంగాణ (Telangana)ఉలిక్కిపడింది. వీటితో పాటు, మూడు రోజుల క్రితం తీన్మార్ మల్లన్న(Theenmar mallanna) ఆఫీసుపై జరిగిన దాడిలో, ఆయన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన ఇన్సిడెంట్ తెలంగాణ రాజకీయాలను హీటెక్కించాయి.
ఈ వరుస ఘటనలు తెలంగాణలో గన్ కల్చర్(Gun Culture) పెరుగుతోందా అనే భయాన్ని పెంచుతుంది. అసలు నిఘా వ్యవస్థ తీరుపై విమర్శలు, శాంతి భద్రతల మాటేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి..
తెలంగాణలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తుండగా, రాష్ట్రంలో లైసెన్స్ ఉన్న తుపాకులు ఎన్ని, అక్రమంగా ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంతమంది అక్రమంగా వాటిని తెప్పిస్తున్నారు అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.
లైసెన్స్ ఉన్న తుపాకులు..
తెలంగాణలో తుపాకీ లైసెన్సుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉందని గత గణాంకాలు సూచిస్తున్నాయి.
మొత్తం లైసెన్సులు, ఆయుధాలు: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 2025 నాటి డేటా ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా 7,125 ఆయుధ లైసెన్సులు జారీ చేయబడ్డాయి. ఈ లైసెన్సుల కింద మొత్తం 9,294 ఆయుధాలు ఉన్నాయి. అంటే, కొందరు లైసెన్సుదారులు ఒకటి కంటే ఎక్కువ ఆయుధాలను కలిగి ఉన్నట్లు అర్ధం.
కొత్త లైసెన్సులు: గత మూడు సంవత్సరాల్లో కేవలం 510 కొత్త లైసెన్సులు మాత్రమే జారీ అయ్యాయి.
ప్రాంతాల వారీగా: 2021 నాటి డేటా ప్రకారం హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలోనే 6,151 ఆయుధాలు ఉండగా, హైదరాబాద్ కమిషనరేట్‌లో సుమారు 4,200 ఆయుధాలు, ఆ తర్వాత రాచకొండ, సైబరాబాద్‌లో వరుసగా 782,587 ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి లైసెన్స్ పొందాలంటే దరఖాస్తుదారుడు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. నేర చరిత్ర ఉండకూడదు, మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి, మరియు తుపాకీ ఎందుకు అవసరమో వివరిస్తూ కారణం చూపించాలి. పోలీసుల క్షుణ్ణమైన ఎంక్వైరీ తర్వాతే లైసెన్స్ మంజూరు చేస్తారు.
అయితే ఇదే సమయంలో వీటిని అక్రమంగా తెప్పిస్తుంది ఎంతమంది? అంటే అది బేతాళ ప్రశ్నగానే మిగిలిపోతుంది. అధికారికంగా లెక్కలు ఉన్న లైసెన్స్డ్ ఆయుధాల కంటే, అక్రమ ఆయుధాల సంఖ్య అంచనా వేయడం చాలా కష్టం అని అధికారులే అనధికారంగా చెబుతున్నారంటే ఇది చాపకింద నీరులా విస్తరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, వివిధ దర్యాప్తు సంస్థల నివేదికలు, పట్టుబడిన కేసుల ఆధారంగా కొన్ని అంచనాలు ఉన్నాయి:
ఎక్కువ డిమాండ్: హైదరాబాద్ వంటి నగరాల్లో అక్రమ తుపాకులకు అధిక డిమాండ్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. గతంలో కత్తులు, కఠార్లు వాడిన నేరాల్లో ఇప్పుడు అక్రమ తుపాకులు వినియోగిస్తున్నారు.
మూలాలు: అక్రమ ఆయుధాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో అక్రమ ఆయుధ తయారీ కేంద్రాలు కంట్రీమేడ్ గన్స్ – కట్టా వంటివి ఉన్నాయి.
సరఫరా మార్గాలు: సెంధ్వా (మధ్యప్రదేశ్), గుజరాత్ సరిహద్దుల మీదుగా ఈ అక్రమ ఆయుధాలు హైదరాబాద్, కేరళ, చెన్నై వంటి నగరాలకు చేరుకుంటున్నాయి.
పోలీసుల నిఘా: టాస్క్ ఫోర్స్ పోలీసులు గతంలో అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు, 2011లో రెండేళ్లలో 65 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకుని, 91 మందిని అరెస్టు చేశారు. అయితే, ఇది పట్టుబడిన వాటి సంఖ్య మాత్రమే. పట్టుబడకుండా చలామణిలో ఉన్నవి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం.
అధికార వ్యవస్థకు సవాల్: ఎక్కడ లోపం జరుగుతోంది..?
నిఘా వ్యవస్థ అంటే కేవలం ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కాదు. నేర ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ ఆయుధాల సరఫరా, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలు, గ్యాంగ్‌ల మధ్య విభేదాలు, రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలు వంటి అనేక అంశాలపై నిరంతరం సమాచారాన్ని సేకరించాలి. నిజానికి ఈ వివరాలన్నీ కూడా పోలీసు నిఘా , ట్రాకింగ్ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. మొత్తంగా ఎక్కడ లోపం కనిపిస్తుందంటే..
మానవ ఇంటెలిజెన్స్ బలహీనత: గ్రౌండ్ స్థాయిలో ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్ బలహీనపడటం. నేరస్తుల మధ్య సంబంధాలు, వారి ప్రణాళికల గురించి సమర్థవంతంగా సమాచారం సేకరించలేకపోతున్నారు.
సాంకేతిక నిఘా కొరవడటం: సైబర్ నిఘా, డేటా అనాలిసిస్, కాల్ డేటా రికార్డుల విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర నియంత్రణకు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. నిఘా వ్యవస్థ సేకరించిన సమాచారం ఆధారంగా, లేదా నేరం జరిగిన తర్వాత, నిందితుల కదలికలను, వారి నెట్‌వర్క్‌లను పక్కాగా ట్రాక్ చేయాలి. కానీ ఈ విషయంలోనూ అనేక లోపాలు కనిపిస్తున్నాయి.
లైసెన్సుడ్ గన్ల దుర్వినియోగంపై అజాగ్రత్త: లైసెన్స్ పొందిన తుపాకులు కలిగిన వారు వాటిని ఎలా వాడుతున్నారు, వారిపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అనే విషయాలపై సరైన ట్రాకింగ్, క్రాస్-చెకింగ్ జరగడం లేదు. కొందరు లైసెన్స్ గన్లను కూడా బెదిరింపులకు, సెటిల్మెంట్‌లకు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అక్రమ ఆయుధాల మూలాలను గుర్తించలేకపోవడం: కాల్పుల ఘటనల్లో దొరికిన అక్రమ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి సరఫరా గొలుసు ఏమిటి, ఎవరు వాటిని తయారు చేస్తున్నారు లేదా దిగుమతి చేసుకుంటున్నారు అనే మూలాలను ఛేదించడంలో ఆలస్యం జరుగుతోంది.
కేసుల దర్యాప్తులో జాప్యం: కొన్ని కేసుల దర్యాప్తులో జాప్యం జరగడం, సరైన ఆధారాలు సేకరించలేకపోవడం వల్ల నిందితులకు శిక్ష పడటం లేదు. ఇది నేరగాళ్లకు మనం ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యాన్ని ఇస్తుంది.
వ్యవస్థాగత కారణాలు- రాజకీయ జోక్యం, సిబ్బంది కొరత
రాజకీయ జోక్యం: రాజకీయ నాయకుల ఒత్తిడి, లేదా వారి ప్రమేయం ఉన్న కేసుల్లో పోలీసులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నారు. ఇది దర్యాప్తును నీరుగార్చి, నిందితులకు తప్పించుకునే అవకాశం ఇస్తుంది.
ఈ అంశాలపై ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించకపోతే, తెలంగాణలో “గన్ కల్చర్” మరింత పెరిగి, రాష్ట్ర భద్రతకు, ప్రజల మనశ్శాంతికి పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది.