Latest News

Andesri :’ జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ కన్నుమూత..అక్షరం నేర్వకపోయినా అగ్ర కవిగా వెలిగిన ప్రజాకవి

Andesri :  అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన జూలై 18, 1961 నాడు జనగాం సమీపంలోని సిద్దిపేట జిల్లా పరిధి రేబర్తి గ్రామంలో జన్మించారు.

Andesri

తెలంగాణ సాహిత్యానికి, సాంస్కృతిక ఉద్యమానికి అద్భుతమైన పాటలతో ప్రాణం పోసిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ (64) కన్నుమూయడం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. సోమవారం (నవంబర్ 10, 2025) ఉదయం లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

అందెశ్రీ(Andesri) అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన జూలై 18, 1961 నాడు అప్పటి వరంగల్ జిల్లా (ప్రస్తుత జనగాం సమీపంలోని సిద్దిపేట జిల్లా పరిధి) రేబర్తి గ్రామంలో జన్మించారు.

అందెశ్రీ బాల్యం ఎంతో కష్టంగా గడిచింది. ఆయన ఒక అనాథగా పెరిగారు, తల్లిదండ్రులు ఎవరో, స్వస్థలం ఎక్కడో కూడా తెలియకుండా పశువుల కాపరిగా, ఆ తర్వాత తాపీ పనివాడిగా జీవనం సాగించారు.

బడి ముఖం కూడా చూడని ఆయనకు ఎలాంటి అక్షరజ్ఞానం లేదు. కానీ ప్రకృతిని, జీవితాన్ని గురువుగా చేసుకుని అపారమైన అనుభవాన్ని, లోకజ్ఞానాన్ని పొందారు.

నిజామాబాద్‌లో తాపీ పని నేర్చుకోవడానికి వెళ్ళిన సమయంలో, ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయనను చేరదీశారు. అప్పుడే ఆయన పేరు ‘అందె శ్రీ’ గా మారింది.

అందెశ్రీ (Andesri)సినీ గేయ రచయితగా, కవిగా, ముఖ్యంగా ప్రజాకవిగా సుప్రసిద్ధులు. ఆయన ప్రకృతి, జీవితం, తెలంగాణ సంస్కృతి మరియు ఉద్యమం వంటి అంశాలపై భావోద్వేగభరితమైన గేయాలు రచించారు. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు.

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గీతాన్ని అందెశ్రీ రచించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ పాట ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఈ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించింది.

‘మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు’ పాట ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన ఈ పాటను ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు పాఠ్యాంశాలలో చేర్చాయి.

‘గంగ’ (2006) సినిమా కోసం రాసిన పాటలకుగాను ఆయన నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా “పల్లె నీకు వందనములమ్మో”, “గలగల గజ్జెల బండి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” వంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి.

ఆయన ‘బతుకమ్మ’ సినిమాకు సంభాషణలు (మాటలు) కూడా రాశారు. తెలంగాణ ధూంధాం కార్యక్రమాలకు రూపశిల్పిగా వ్యవహరించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు.

బడి ముఖం చూడకపోయినా, తన అపారమైన ప్రతిభకు గుర్తింపుగా అందెశ్రీ అనేక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.ఈ ఏడాది (2025) జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.

Andesri
Andesri

2014లో వాషింగ్టన్ డి.సి.లోని అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనను ‘లోకకవి’ (World Poet) బిరుదుతో గౌరవించింది. దాశరథి సాహితీ పురస్కారం మరియు డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వంటివి ఆయన అందుకున్నారు.

అనాథగా పెరిగి, అక్షరం నేర్వకపోయినా, తన సహజసిద్ధమైన కవిత్వంతో కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన అందించిన పాటలు, కవిత్వం చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయి.

మరోవైపు అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్​ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button