YS Jagan: ఆరేళ్ల తర్వాత కోర్టుకు వైఎస్ జగన్.. అక్రమాస్తుల కేసు విచారణ
YS Jagan: ఆరేళ్ళుగా జగన్ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటూ న్యాయస్థానానికి తెలియజేసింది.
YS Jagan
ఏపీ మాజీ సీఎం, వైఎస్ జగన్(YS Jagan) పై నమోదైన అక్రమాస్తుల కేసులో ఏళ్ల తరబడిగా విచారణ సాగుతూనే ఉంది. 2012లో జగన్ అరెస్ట్ కావడం..16 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత 2013లో బెయిల్ మంజూరు కావడం.. అప్పటి నుంచీ బెయిల్ పైనే జగన్ ఉన్నారు. అంటే దాదాపు 12 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్న జగన్ గతంలో ఒకటి రెండు సార్లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు.
గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన తర్వాత జగన్ వ్యక్తిగత హాజరు అంశానికి సంబంధించి సీబీఐ న్యాయస్థానం ముందు విజ్ఞప్తులు చేస్తోంది. ఇటీవలే నాంపల్లి కోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలివ్వడంతో వైఎస్ జగన్ నవంబర్ 20న వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వైఎస్ జగన్ ఇటీవలే యూరప్ పర్యటనకు వెళ్ళారు. దీని కోసం కోర్టు అనుమతి కోరుతూ ఆయన వేసిన పిటిషన్ విచారణ జరిపినప్పుడు న్యాయస్థానం కొన్ని షరతులు పెట్టింది. యూరప్ పర్యటన తర్వాత కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

పర్యటన పూర్తయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం సెక్యూరిటీ ఏర్పాట్లు ప్రభుత్వానికి భారమని సాకుగా చూపుతూ వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతివారం హాజరవుతానని కోరారు. దీనిపై సీబీఐ అభ్యంతరం తెలిపిన సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఆరేళ్ళుగా జగన్ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటూ న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రస్తుతం ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్ల విచారణ రెగ్యులర్ గా జరుగుతున్న నేపథ్యంలో జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని కోరింది. అదే సమయంలో యూరప్ పర్యటనకు ముందు కోర్టు విధించిన షరతులను జగన్ పట్టించుకోలేదంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జగన్ హాజరు కావాలని అతని తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. కొన్ని రోజుల సమయం కావాలని కోరగా.. కోర్టు నవంబర్ 21 లోపు హాజరయ్యేలా సూచన చేసింది. దీంతో నవంబర్ 20న వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరువుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 2004-09 దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు… జగన్ క్విట్ ప్రో ద్వారా అక్రమ ఆస్తులు కూడబెట్టారని కేసులు నమోదయ్యాయి.



