God:దేవుడిని ప్రార్థిస్తున్నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదా?
God: దేవుడితో మాట్లాడటం అంటే వాళ్లకు తమ బాధను సాక్షాత్తూ భగవంతుడే వింటున్నారు అన్న ఫీలింగ్. ఆ భావన మనసులో భద్రతను కలిగిస్తుంది.
God
ప్రార్థన, లేదా పూజ అనేది మన సంస్కృతిలో చాలా సహజమైన విషయం. కానీ ఒకే ప్రార్థన, ఒకే దేవుడు(God) అయినా, అందరికీ ఒకే ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న చాలా మందిని లోపల కలచివేస్తుంది. కొందరికి భగవంతుడిని ప్రార్థించిన వెంటనే మనసు తేలికగా అనిపిస్తుంది, శాంతి దొరికినట్టు ఫీలవుతారు. మరికొందరికి మాత్రం ఎంత చేసినా మనసులో కలకలం అలాగే ఉంటుంది.
ఈ తేడా భక్తిలో కాదు, మన ప్రార్థనలో ఉండే మానసిక స్థితిలో ఉంటుంది. సైకాలజీ ప్రకారం, ప్రార్థన అనేది మనసు కొంతసేపు ఆగే ఒక ప్రక్రియ. రోజంతా పరుగులు పెట్టే ఆలోచనలు, భయాలు, అంచనాలు ఇవన్నీ కొంతసేపు పక్కకు వెళ్లి ఒకే దిశగా కేంద్రీకృతం అవుతాయి. ఈ ఏకాగ్రతే కొందరికి శాంతిని ఇస్తుంది.
దేవుడి(God)ని ప్రార్థించడాన్ని కొందరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగిస్తారు. దేవుడితో మాట్లాడటం అంటే వాళ్లకు తమ బాధను సాక్షాత్తూ భగవంతుడే వింటున్నారు అన్న ఫీలింగ్. ఆ భావన మనసులో భద్రతను కలిగిస్తుంది. కానీ అందరికీ ఈ అనుభూతి ఎందుకు రాదు అంటే, చాలా మంది ప్రార్థనను కూడా ఒత్తిడిగా మార్చుకుంటారు. ప్రార్థన సమయంలో కూడా ఇది జరగాలి, లేకపోతే ఏమవుతుంది అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి.

అలా ప్రార్థన చేసినా మనసు అసలు రిలాక్స్ అవ్వదు. బయట దేవుడి ముందు కూర్చున్నా, లోపల మాత్రం సమస్యల మధ్యే ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం అంచనాలు. ప్రార్థన చేసిన వెంటనే సమస్య తీరాలి అనే అంచనాలు పెట్టుకున్నప్పుడు, ఫలితం ఆలస్యమైతే నిరాశ మొదలవుతుంది. ఆ నిరాశే ప్రార్థన చేసినా ఉపయోగం లేదు అనే భావనకు దారితీస్తుంది.
చాలామంది ప్రార్థనను ఒక లెక్కల వ్యవహారంలా చూస్తారు. ఇంత చేశాను కదా, ఇది రావాలి అనే లాజిక్‌తో ప్రార్థన చేస్తారు. అలా చేసినప్పుడు శాంతి రావడం కష్టం. ఎందుకంటే అక్కడ నమ్మకం కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఉన్న చోట భయం ఉంటుంది, భయం ఉన్న చోట శాంతి ఉండదు. గిల్ట్ (Guilt) కూడా ఒక పెద్ద కారణం.
కొందరు భగవంతుడిని ప్రార్థిస్తూనే నేను తప్పులు చేస్తున్నాను అని తమను తాము నిందించుకుంటారు. సైకాలజీ ప్రకారం, మన మెదడు మనం నిజంగా నమ్మే ఏ విషయాన్నైనా ఒక సేఫ్ స్పేస్లా తీసుకుంటుంది. కానీ ఆ ఆధారాన్ని మనం భయంతో వాడితే అది ఒత్తిడిగా మారుతుంది. నిజానికి ప్రార్థన దేవుడిని మార్చే ప్రక్రియ కాదు, మన మనసును మార్చే ప్రక్రియ. ఆ మార్పు జరగాలంటే, భగవంతుడిని ప్రార్థించే సమయంలో మన అంచనాలను పక్కన పెట్టాలి.



