Just Andhra PradeshLatest News

Liquor Shops: బెల్టు షాపుల కట్టడికి ఉక్కుపాదం.. హర్యానా మోడల్‌తో ఏపీ సీఎం కొత్త ప్లాన్

Liquor Shops: అక్రమ మద్యం, నకిలీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి చంద్రబాబు ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు.

Liquor Shops

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానం అనేది కొన్నేళ్లుగా ఒక పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు.

తాజాగా ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. మద్యాన్ని కేవలం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వనరుగా మాత్రమే చూడవద్దని, అది ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించారు.ఈ సమీక్షలో ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ‘బెల్టు షాపులు(Liquor Shops)’.

రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులు సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని, వీటిని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చంద్రబాబు ఆదేశించారు.

దీనికోసం హర్యానా రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ‘సబ్ లీజు’ విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో లేదా దూర ప్రాంతాల్లో మద్యం షాపులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ బెల్టు షాపులు పుట్టుకొస్తున్నాయని, వాటిని నియంత్రించేందుకు షాపుల హేతుబద్ధీకరణ (Rationalization) జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అక్రమ మద్యం , నకిలీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి చంద్రబాబు ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. అదే ‘లిన్’ (LIN – Liquor Identification Number). ఇకపై ప్రతి మద్యం బాటిల్‌కు ఒక ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది.

Liquor Shops
Liquor Shops

దీని ద్వారా ఆ బాటిల్ ఏ కంపెనీలో తయారైంది, ఏ బ్యాచ్ కు చెందింది, ఎప్పుడు షాపునకు వచ్చింది అనే పూర్తి వివరాలు ట్రాక్ చేయొచ్చు. సామాన్య ప్రజలు కూడా తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆ నంబర్ ను స్కాన్ చేసి, అది అసలు మద్యమా లేక నకిలీదా అని తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రజల ప్రాణాలతో ఆడుకునే నకిలీ మద్యం(Liquor Shops) మాఫియాకు చెక్ పడుతుంది.

అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం ‘డిపాజిట్ రిటర్న్ స్కీమ్’ (DRS) అనే మరో వినూత్న ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని ప్రకారం, మద్యం సేవించిన తర్వాత ఖాళీ బాటిల్‌ను తిరిగి షాపులో ఇస్తే కొంత నగదును కస్టమర్‌కు తిరిగి ఇస్తారు. దీనివల్ల రోడ్ల మీద, కాలువలలో మద్యం బాటిళ్లు పడేయకుండా ఒక క్రమశిక్షణ వస్తుంది.

అలాగే మద్యం షాపు(Liquor Shops)ల్లో డిజిటల్ పేమెంట్లను 100 శాతం అమలు చేయాలని, తద్వారా నగదు లావాదేవీల్లో జరిగే అవకతవకలను అరికట్టవచ్చని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం పెరిగినా కూడా, పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే ఇక్కడ తలసరి మద్యం వినియోగం చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button