Mohammed Shami:పాపం మహ్మద్ షమీ… ఇక కెరీర్ ముగిసినట్టేనా?
Mohammed Shami: హానే, పుజారా, అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఒక్కొక్కరుగా జట్టు నుంచి తప్పుకున్నారు.. కాదు కాదు తప్పించబడ్డారు.
Mohammed Shami
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్ ప్లేయర్స్ కెరీర్ లు వరుసగా ముగిసిపోతున్నాయి. రహానే, పుజారా, అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఒక్కొక్కరుగా జట్టు నుంచి తప్పుకున్నారు.. కాదు కాదు తప్పించబడ్డారు.. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ వన్డే జట్టులో కొనసాగుతుండగా వారి భవిష్యత్తుపైనా గ్యారెంటీ లేదు.
తాజాగా ఇదే జాబితాలోకి మరో సీనియర్ క్రికెటర్ చేరబోతున్నాడు. అతను ఎవరో కాదు వెటరన్ పేసర్ మహ్మద్ షమీ.. జట్టులో అత్యంత అనుభవం ఉన్న బౌలర్ గా, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో షమీకి గుర్తింపు ఉంది. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ లో షమీ అదిరిపోయే బౌలింగ్ తో జట్టును ఫైనల్ కు చేర్చాడు. అలాంటి షమీకి ఇప్పుడు జట్టులో ప్లేస్ లేకుండా పోయింది.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నా షమీకి చోటు దక్కడం లేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా రంజీ ట్రోఫీలోనూ రాణించాడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ , ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అదరగొట్టాడు. అయినా కూడా అతన్ని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
తాజాగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కూ షమీని పక్కన పెట్టారు. నిజానికి కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటానని చాలా సార్లు చెప్పాడు. సీనియర్లు కూడా ఆడాల్సిందేనంటూ హుకుం జారీ చేశాడు. మరి ఇప్పుడు షమీ దేశవాళీలో అదరగొడుతున్నా కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదనేది గంభీరే చెప్పాలి.
బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో షమీకి చోటు ఖాయమని, రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు.కానీ సెలక్టర్లు మాత్రం షమీకి మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. సిరాజ్ ను తీసుకున్న సెలక్టర్లు షమీని ఎందుకు ఎంపిక చేయలేదన్నది తెలియడం లేదు. అయితే సెలక్షన్ కమిటీపై గతంలో షమీ చేసిన విమర్శలే అతన్ని పక్కన పెట్టడానికి కారణమా అన్న వాదన వినిపిస్తోంది.

షమీ ఫిట్ గా లేకపోవడంతోనే ఎంపిక చేయలేకపోయామంటూ ఆసీస్ టూర్ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెప్పాడు. దీనికి షమీ బహిరంగంగానే మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చాడు. ఫిట్ గా లేకుంటే రంజీ ట్రోఫీ ఎందుకు ఆడతానంటూ ప్రశ్నించాడు. షమీ చేసిన ఈ కామెంట్స్ అటు అగార్కర్ కు, ఇటు గంభీర్ కు కోపం తెప్పించాయి. ఫలితంగానే ఎంత బాగా ప్రదర్శన చేసిన పట్టించుకోవడం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే 2027 వన్డే ప్రపంచకప్ ప్లాన్స్ లో అతను లేడని తెలుస్తోంది. అందుకే సెలక్టర్లు పట్టించుకోవడం లేదని చాలా మంది తేల్చేస్తున్నారు. షమీ కెరీర్ లో ఎక్కువ కాలం గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతోనే ఇబ్బంది పడ్డాడు. అయినా మరొక అవకాశం ఇస్తే తప్పేంటని పలువురు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.



