IMD:బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
IMD: మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ( IMD) ప్రకటించింది.
IMD
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది చలి తీవ్రత గతంలో ఎప్పుడూ లేనంతగా పతాక స్థాయికి చేరుకుంది. ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుంటే, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ( IMD) ప్రకటించింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయని తెలిపింది.
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్.. తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి గాలుల వల్ల ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

చిన్నపిల్లలు, వృద్ధులు తెల్లవారుజామున అలాగే సాయంత్రం చలిగాలులు, మంచు ప్రభావం ఉంటుందని ఆ సమయాలలో బయటకు రావద్దని వాతావరణ శాఖ ( IMD) అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
ఏపీలో వర్ష సూచన..ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమ , దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని మాడుగులలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పసిపిల్లలు, వృద్ధులు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే పొగమంచు వల్ల వాహనదారులు వేగం తగ్గించి ప్రయాణించాలని సూచించారు.



