Greenland:గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ఇటాలియన్ ప్రధాని మెలోని స్ట్రాంగ్ కౌంటర్
Greenland: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద అగ్గినే రాజేశారు
Greenland
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద అగ్గినే రాజేశారు. డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్(Greenland)ను.. అమెరికాలో విలీనం చేసుకోవాలనే తన పాత ప్రతిపాదనను ట్రంప్ మళ్లీ తెరపైకి తెచ్చారు.
యూరోపియన్ దేశాలు అంగీకరించినా, అంగీకరించకపోయినా అమెరికా మాత్రం గ్రీన్‌ల్యాండ్(Greenland)ను స్వాధీనం చేసుకుంటుందని, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యూహాత్మక ద్వీపంపై రష్యా, చైనాలు తమ ప్రభావాన్ని విస్తరించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన ఉద్దేశమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. రష్యా, చైనాలను తమ పొరుగు దేశాలుగా మార్చుకునే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
ట్రంప్ చేసిన ఈ దూకుడు వ్యాఖ్యలపై ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఘాటుగా స్పందించారు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా సైనిక బలగాలను ఆశ్రయిస్తుందని తాను నమ్మడం లేదని జార్జియా మెలోని అన్నారు. సైనిక చర్య అనేది ఎవరికీ ప్రయోజనం కలిగించదని, పైగా నాటో (NATO) కూటమిలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మెలోని హెచ్చరించారు.

ఇటలీ అటువంటి చర్యలకు ఎప్పటికీ సపోర్ట్ చేయదని జార్జియా మెలోని స్పష్టం చేశారు. అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల కదలికల పట్ల అమెరికాకు ఉన్న భద్రతా ఆందోళనలను తాము అర్థం చేసుకోగలమని, దీనికి పరిష్కారం సైనిక చర్య కాదని, నాటో ఉనికిని అక్కడ మరింత బలోపేతం చేయడమేనని ఆమె సూచించారు.
నిజానికి ట్రంప్ తన మొదటి పదవీకాలం నుంచే గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ డెన్మార్క్ దీనిని చాలా ఎక్కువగా వ్యతిరేకిస్తోంది. వెనిజులాలో అమెరికా సైనిక చర్య తర్వాత, ట్రంప్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఖనిజ సంపదకు నిలయమైన గ్రీన్‌ల్యాండ్ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో బ్రిటన్, జర్మనీ,ఫ్రాన్స్ లతో పాటు ఇటలీ కూడా డెన్మార్క్‌కు అండగా నిలుస్తోంది.
ఐరోపాలో ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న మెలోని కూడా ఈ విషయంలో వ్యతిరేకత తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికా – యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడంలో మధ్యవర్తిగా ఉండే మెలోని, ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Reviews and Ratings:సంక్రాంతి సినిమాల రివ్యూలు, రేటింగ్స్ బంద్..కోర్టు జోక్యం ఎందుకు?




2 Comments