Badrinath:బద్రీనాథ్ యాత్ర 2026..ఏప్రిల్ 23న తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు
Badrinath: బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరిచిన రోజున భక్తులకు లభించే అఖండ జ్యోతి దర్శనం ఎంతో పుణ్యప్రదమైనదిగా పురాణాలు చెబుతాయి.
Badrinath
అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో.. కీలకమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరిచే శుభ ముహూర్తం ఖరారైంది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఉత్తరాఖండ్‌లోని నరేంద్ర నగర్ రాజప్రసాదంలో రాజపురోహితులు అధికారికంగా ఈ తేదీని ప్రకటించారు.
రాజపురోహితుల చెప్పిన ప్రకారం..2026 ఏప్రిల్ 23న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో హిమపాతం వల్ల ఆరు నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయాన్ని.. మళ్లీ వేసవి కాలంలో ప్రారంభించడం ఒక ఆధ్యాత్మిక వేడుకలా జరుగుతూ ఉంటుంది.
అయితే తాజాగా ఈ ప్రకటన రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ..తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.
బద్రీనాథ్(Badrinath) ఆలయ విశిష్టత గురించి చెప్పుకోవాలంటే.. దీనిని భూలోక వైకుంఠంగా భావిస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి ధ్యాన ముద్రలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా, ఇక్కడ పూజలు నిర్వహించే రావల్జీలు అంటే అర్చకులు కేరళలోని నంబూద్రి బ్రాహ్మణులే ఉండాలని నిబంధన విధించారు.
ఆలయ ద్వారాలు తెరిచిన రోజున భక్తులకు లభించే అఖండ జ్యోతి దర్శనం ఎంతో పుణ్యప్రదమైనదిగా పురాణాలు చెబుతాయి. ఆరు నెలల పాటు ఆలయం మూసి ఉన్న సమయంలో కూడా.. ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉండటం ఇక్కడి గొప్ప విశేషంగా నిలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి బద్రీనాథ్(Badrinath) వెళ్లాలనుకునే ప్రయాణికులు.. ముందుగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లేదా పవిత్ర క్షేత్రమయిన హరిద్వార్ చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయినా విజయవాడ నుంచి అయినా ఢిల్లీకి విమానం లేదా రైలు మార్గంలో వెళ్లి, అక్కడ నుంచి డెహ్రాడూన్ లేదా రిషికేష్ చేరుకోవచ్చు.
రిషికేష్ నుంచి బద్రీనాథ్ చేరుకోవడానికి.. దాదాపు 300 కిలోమీటర్ల దూరం పర్వత ప్రాంతాల్లో ప్రయాణించాలి. దీనికోసం ప్రైవేట్ టాక్సీలు కానీ ఉత్తరాఖండ్ రవాణా సంస్థ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయి.
అయితే యాత్రకు వెళ్లే ముందు భక్తులు ఉత్తరాఖండ్ ప్రభుత్వ వెబ్సైట్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనివల్ల భక్తుల భద్రతతో పాటు వసతి సౌకర్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వానికి ఈజీ అవుతుంది.

బద్రీనాథ్ స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు తప్పక చూడాల్సిన ప్రదేశాలు అక్కడ మరికొన్ని ఉన్నాయి. ఆలయానికి సమీపంలోనే ఉండే తప్తకుండ్ (వేడి నీటి బుగ్గ)లో స్నానం చేయడం వల్ల అలసట తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
బద్రీనాథ్ ఆలయం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మాణా గ్రామం భారతదేశపు చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వ్యాస గుహ, గణేశ గుహ , సరస్వతి నది ఉద్భవించే భీమ్ పుల్ చూడదగ్గ ప్రదేశాలుగా స్థానికులు చెబుతారు. పాండవులు స్వర్గానికి వెళ్లే మార్గంగా భావించే ‘స్వర్గారోహిణి’ మార్గం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందట.
ప్రకృతి ప్రేమికులు బద్రీనాథ్ నుంచి కొద్ది దూరంలో ఉండే ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ (పూల లోయ) అలాగే హేమకుండ్ సాహిబ్ క్షేత్రాలను కూడా సందర్శించొచ్చు. భక్తి , ప్రకృతి అందాల కలయికగా సాగే.. ఈ యాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది.
Padma Shri:పద్మశ్రీ పురస్కారాలు 2026.. తెలుగు వెలుగులతో పాటు సామాన్యులకు పెద్దపీట




One Comment