Just SportsLatest News

ODI:భారత మహిళల జట్టుకు ఘోరపరాభవం.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్

ODI: మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందనుకున్న భారత మహిళల జట్టు ఘోరపరాజయం పాలైంది.

ODI

ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్(ODI) లో మాత్రం ఘోరపరాభవం ఎదురైంది. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారంగా కంగారూలు వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందనుకున్న భారత మహిళల జట్టు ఘోరపరాజయం పాలైంది. ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్ 185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హోబార్ట్ వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ బ్యాటర్లు దుమ్మురేపారు.

ఓపెనర్ అలీసా హీలీ , బెత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ సెంచరీలతో రెచ్చిపోయారు. లిచ్ ఫీల్డ్ 14 పరుగులకే ఔటైనా జార్జియా వోల్ తో కలిసి హీలీ 104 పరుగులు, బెత్ మూనీతో కలిసి 145 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పింది.

ఈ క్రమంలో కెప్టెన్ అలీసా హీలీ 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స్‌లతో 158 పరుగులు చేయగా.. మరింత దూకుడుగా ఆడిన బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 106 పరుగులతో చెలరేగింది. చివర్లో అన్నా సదర్లాండ్ , నికోలస్ క్యారీ కూడా ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 409 పరుగుల భారీస్కోరు చేసింది. భారత బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు , రేణుక సింగ్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.

ODI
ODI

అనంతరం భారత జట్టు పెద్దగా పోటీ నివ్వలేకపోయింది. స్మృతి మంధాన డకౌటవగా.. ప్రతీకా రావల్ 27, హర్మన్ ప్రీత్ కౌర్ 25 , హ్యార్లిన్ డియోల్ 14 , దీప్తి శర్మ 29 , రిఛా ఘోష్ 18 పరుగులకే ఔటయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ 20 బంతుల్లో 9 ఫోర్లతో 42 రన్స్ చేయగా.. స్నేహ రాణా 44 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు ఫెయిలవడంతో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో అలానే కింగ్ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. జార్జియో వేర్‌హమ్ 2, నికోల క్యారీ, అన్నాబెల్ సదర్లాండ్, అష్లే గార్డ్‌నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఆసీస్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్ ను భారత్ గెలుచుకోగా.. ఇప్పుడు వన్డే సిరీస్(ODI) ను ఆసీస్ 3-0తో స్వీప్ చేసింది. ఇక రెండు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి మొదలవుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button