NZ vs SA :సౌతాఫ్రికా,కివీస్ తొలి సెమీస్..ఈడెన్ ఎవరిదో ?
NZ vs SA : టీ20 ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్‌కు చేరింది. 20 జట్లతో మొదలైన మెగాటోర్నీలో ఇప్పుడు నాలుగు జట్లే మిగిలాయి. సెమీఫైనల్స్ బుధవారం నుంచి మొదలుకానున్నాయి.
NZ vs SA
టీ20 ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్‌కు చేరింది. 20 జట్లతో మొదలైన మెగాటోర్నీలో ఇప్పుడు నాలుగు జట్లే మిగిలాయి. సెమీఫైనల్స్ బుధవారం నుంచి మొదలుకానున్నాయి. తొలి సెమీస్ లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్(NZ vs SA) తలపడబోతున్నాయి. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత ఎడిషన్ రన్నరప్ గా నిలిచిన సౌతాఫ్రికా మరోసారి టైటిల్‌పై కన్నేసింది. తమ టైటిల్ కల నెరవేర్చుకునే క్రమంలో ఈ సెమీస్ అడ్డంకిని దాటాల్సి ఉంది.
అటు న్యూజిలాండ్‌ను(NZ vs SA) కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. చివరి సూపర్ 8 మ్యాచ్ లో ఓడినా సరే ఈ మెగాటోర్నీలో కివీస్ బాగానే ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సెమీఫైనల్లో సౌతాఫ్రికాను హాట్ ఫేవరెట్ గా భావిస్తున్నారు. ఎందుకంటే లీగ్ స్టేజ్ నుంచి సూపర్ 8 ముగిసే వరకూ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు.
ముఖ్యంగా టైటిల్ ఫేవరెట్, డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాను కూడా చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లోనూ మంచి ఫామ్ లో ఉన్న సఫారీలు గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో ఐసీసీ టైటిల్ వేట షురూ చేసింది. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లోనూ విశ్వవిజేతగా నిలవాలన్న లక్ష్యంతో వరల్డ్ కప్ ఆరంభం నుంచీ అద్భుతంగా రాణిస్తోంది.
బ్యాటింగ్‌లో మార్క్ రమ్, బ్రెవిస్ , స్టబ్స్ , మిల్లర్ పై అంచనాలున్నాయి. కెప్టెన్ మార్క్ రమ్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా.. బ్రెవిస్ , స్టబ్స్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌లో మార్కో యెన్సన్, రబాడ కూడా లైన్ అండ్ లెంగ్త్ అందుకున్నారు.
మరోవైపు న్యూజిలాండ్ అదృష్టవశాత్తూ సెమీఫైనల్‌కు చేరింది. పాక్ తో పాయింట్లు సమమైనా మెరుగైన రన్ రేట్ కారణంగా ముందంజ వేసింది. శ్రీలంకపై గెలిచిన కివీస్ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. కొన్ని మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం కూడా కివీస్ బలహీనతగా చెప్పొచ్చు. మిఛెల్ శాంట్నర్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ కు బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లు ఉన్నా సరే.. నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.

సిఫర్ట్ , ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ పై అంచనాలున్నాయి. చివర్లో శాంట్నర్ కూడా బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే చాప్ మన్, డారిల్ మిఛెల్ కూడా రాణిస్తే న్యూజిలాండ్ భారీస్కోరు సాధించే అవకాశముంటుంది.
బౌలింగ్‌లో ఫెర్గ్యుసన్, మ్యాట్ హెన్రీ రాణిస్తుండగా.. రచిన్ కూడా పార్టటైమ్ బౌలర్ గా కీలకంగా మారాడు. అయితే సఫారీ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయాలంటే కివీస్ బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందే. ఇదిలా ఉంటే గత రికార్డుల్లో మాత్రం సౌతాఫ్రికాదే పైచేయిగా ఉంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది కాబట్టి.. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.



