Hair Loss:హెయిర్ వాష్ గైడ్.. జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలి?
Hair Loss: అతిగా తలస్నానం చేసినా అలాగే అస్సలు చేయకపోయినా కూడా జుట్టు రాలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
Hair Loss
మనిషి అందంగా కనిపించాలంటే కేవలం మంచి బట్టలు, ముఖ వర్చస్సు ఉంటే సరిపోదు. జుట్టు కూడా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలి. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, పొల్యూషన్, డైలీ తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం అనేది చాలామందిలో పెద్ద సమస్యగా మారిపోయింది.
ఈ జుట్టు రాలే (Hair Loss)సమస్యను పరిష్కరించడానికి రక రకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. కానీ, అసలు సమస్యంతా మనం చేసే తలస్నానంలోనే ఉందంటున్నారు నిపుణులు. అతిగా తలస్నానం చేసినా అలాగే అస్సలు చేయకపోయినా కూడా జుట్టు రాలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
నిజానికి జుట్టు రాలకుండా (Hair Loss) ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు స్నానం చేయాలనేది మీ జుట్టు రకాన్ని బట్టి కూడా ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా మారుతుందట. కొంతమందికి పుట్టుకతోనే తల మీద స్కాల్ప్ చాలా జిడ్డుగా ఉంటుంది.ఇలా జిడ్డు జుట్టు ఉన్నవారికి త్వరగా చెమట పట్టడం, దుమ్ము చేరడం వల్ల కుదుళ్లు త్వరగా బలహీనపడతాయి. కాబట్టి ఇలాంటివారు వారానికి కనీసం 3నుంచి 4 సార్లు అయినా మంచి షాంపూతో తలస్నానం చేయాలి. లేదంటే ఆ జిడ్డు వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది.
మరో కొంతమందికి జుట్టు చాలా పొడిగా (Dry Hair) ఉంటుంది. ఇలాంటి వాళ్లు పొరపాటున కూడా ఎక్కువసార్లు తలస్నానం చేయకూడదు. రోజూ స్నానం చేయడం వల్ల జుట్టులోని నేచురల్ ఆయిల్స్ కోల్పోయి, జుట్టు మరింత గడ్డిలా మారి ముక్కముక్కలుగా విరిగిపోతుంది. వీళ్లు వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.

ఇక సాధారణ జుట్టు ఉన్నవాళ్లు వారానికి 2 నుంచి 3 సార్లు స్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ వేడి నీళ్లను వాడకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లు కానీ చల్లని నీళ్లను కానీ వాడాలి. అది కూడా షాంపూలలో కూడా కెమికల్స్ లేనివి ఎంచుకోవడం ముఖ్యం.
మరీ ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దువ్వకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కుదుళ్లు చాలా మెత్తగా ఉండటంతో.. జుట్టు త్వరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది.





