Just SportsLatest News

World Cup : 2027 వన్డే ప్రపంచకప్‌..టీమ్ కాంబినేషన్ పై చర్చ

World Cup : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ వన్డే ప్రపంచకప్. 2023లో తృటిలో చేజారిన కప్పును, 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది

World Cup

క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ వన్డే ప్రపంచకప్(World Cup). 2023లో తృటిలో చేజారిన కప్పును, 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్(World Cup) ను మూడుసార్లు గెలిచిన టీమిండియా ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ను కూడా ముచ్చటగా మూడోసారి గెలిచి సత్తా చాటాలని ఎదురు చూస్తోంది.

దీనికి మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న వేళ భారత జట్టు కాంబినేషన్ పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తుది జట్టు కూర్పు పైనే ఆసక్తి నెలకొంది. అప్పటికి మన జట్టులో ఎవరెవరు ఉంటారు…అనుభవం కావాలా లేక యువ రక్తం కావాలా అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక “పర్ఫెక్ట్ ఎలెవన్” ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వైరల్ టీమ్ ప్రకారం, 2027లో కూడా రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. వయస్సు పెరిగినా, రోహిత్ ఇచ్చే దూకుడైన ఆరంభాలు జట్టుకు ఎంత కీలకమో అందరికీ తెలుసు. అతనికి తోడుగా ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లలో దుమ్ము రేపిన సంజూ శాంసన్ ఓపెనర్‌గా కనిపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ వంటి యువకులను కాదని శాంసన్ ను ఎంచుకోవడం ఆసక్తికరమైన అంశంగా చెప్పొచ్చు.

ఇక వన్ డౌన్ స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ జట్టుకు వెన్నెముకగా నిలవనున్నాడు. మిడిలార్డర్ బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా ఉంటాడు. అటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా కే ఎల్ రాహుల్ కాయ. ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు అసలైన బలం. పాండ్యా బౌలింగ్ కూడా భారత్ విజయావకాశాలను డిసైడ్ చేస్తుంది.

భారత పిచ్‌లపైనే కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా స్పిన్ ఆల్‌రౌండర్లు చాలా ముఖ్యం. అందుకే ఈ జాబితాలో అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు దక్కింది. వీరిద్దరూ పది ఓవర్ల కోటాలో కీలక వికెట్లు తీసే సత్తా ఉన్న వీరిద్దరూ చివర్లో బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించగలరు. అందుకేబౌలింగ్ విభాగంలో భారత్ ఇప్పటికీ అనుభవానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక భారత్ బౌలింగ్ ఎటాక్ లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలకం.

World Cup
World Cup

అతనితో పాటుమహ్మద్ సిరాజ్ , మహ్మద్ షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ షమీ ఫిట్‌నెస్‌తో ఉంటే,ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే. అయితే ఈ కాంబినేషన్ చూస్తుంటే చాలా పటిష్టంగా అనిపిస్తున్నా.. కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.2027 నాటికి రోహిత్, కోహ్లీ, షమీ వంటి ఆటగాళ్లు 40 ఏళ్లకు చేరువలో ఉంటారు. వారి ఫిట్‌నెస్ అప్పుడు ఎలా ఉంటుందనేది పెద్ద సవాల్.

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. భవిష్యత్తు దృష్ట్యా వీరిని పక్కన పెట్టడం కష్టమే.

ఏది ఏమైనా, ఈ జట్టు పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తోంది. అనుభవం , యువ నైపుణ్యం పుష్కలంగా ఉన్న ఈ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగితే, 2027 ప్రపంచకప్(World Cup) మన సొంతం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కానీ ఫామ్, ఫిట్‌నెస్ ఆధారంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎలాంటి జట్టును ఎంపిక చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button