Bangladesh : యుద్ధంతో ఇంధన సంక్షోభం…బంగ్లాదేశ్ లో లాక్ డౌన్
Bangladesh :బంగ్లాదేశ్ లో లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆ దేశ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది
Bangladesh
ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల పలు దేశాల్లో ఇంధన సంక్షోభం తారాస్థాయికి చేరింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ పరిస్థితితో ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. ఫలితంగా బంగ్లాదేశ్(Bangladesh) లో లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆ దేశ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.
పొదుపు చర్యలను ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.బంగ్లాదేశ్(Bangladesh) ప్రధాని తారిఖ్ రెహ్మాన్ దీనిపై ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆఫీసు పనివేళలు, మార్కెట్ల మూసివేత వంటి వాటిపై ఆంక్షలు విధించారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త రూల్స్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులనుబంగ్లాదేశ్(Bangladesh) ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆదేశించారు.
ఈ కొత్త రూల్స్ చూస్తే లాక్ డౌన్ గా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయమైనా, ప్రైవేట్ కార్యాలయమైనా పనివేళలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసులన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేయాలని ఆదేశించారు. గతంతో పోలిస్తే ఒక గంట ముందే ఆఫీసులు మూసివేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు పనివేళల్లోనూ మార్పులు చేశారు.
కస్టమర్ల సర్వీసులను 3 గంటలలోపే ముగించాలని, ఆఫీసు అంతర్గత పనులను 4 గంటలకల్లా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. కేవలం ఆఫీసులు మాత్రమే కాకుండా సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ , మార్కెట్లపైనా ఆంక్షలు విధించారు. అన్నీ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపునిచ్చారు. అత్యవసర సేవలు, హాస్పిటల్స్ , మెడికల్ షాపులు, ఫుడ్ సెంటర్లకు మాత్రం వెసులుబాటు కల్పించారు.

మరోవైపు ప్రభుత్వం తమ ఖర్చులపై కూడా భారీ కోత పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధనం, విద్యుత్ కోసం కేటాయించిన బడ్జెట్ లో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా వాహనాలు, విమానాలు వంటి కొనుగోలును నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఎలాంటి ఖర్చులూ చేయొద్దని ప్రభుత్వం ఆయా శాఖలకు గట్టిగా చెప్పింది. బంగ్లాదేశ్ జనాాభా 17 కోట్ల వరకూ ఉంటుంది.
ఎక్కువగా ఇంధన అవసరాల కోసం దాదాపు 95 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడడం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఇంధన దిగుమతుల కోసం భారత్ ను సాయం కోరుతోంది. 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు డీజిల్ సరఫరా చేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.





