TVK Vijay : విజయ్ అఫిడవిట్లలో తేడాలు…జైలు శిక్ష తప్పదా ?
TVK Vijay : తమిళనాడులో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. మరోవైపు నామినేషన్ల ఘట్టం ఉత్సాహంగా సాగుతోంది
TVK Vijay
తమిళనాడులో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. మరోవైపు నామినేషన్ల ఘట్టం ఉత్సాహంగా సాగుతోంది. ఈసారి తమిళనాట త్రిముఖ పోటీ నెలకొంది. నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అందరి చూపు ఇక్కడే ఉంది. టీవీకే పార్టీ స్థాపించిన విజయ్(TVK Vijay) తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.
సరికొత్త రాజకీయం చేస్తానంటూ డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొంటున్నారు. అయితే విజయ్ పార్టీ ప్రకటించినప్పటి నుంచీ పలు సమస్యలు వెంటాడుతున్నాయి. తొక్కిసలాట ఘటన విజయ్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపించింది. నటుడిగా చివరి సినిమా జననాయగన్ విడుదల పలు అడ్డంకులతో ఆగిపోయింది.
ఇటు నామినేషన్లు దాఖలు చేసి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్న విజయ్(TVK Vijay) కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. విజయ్ ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. అయితే విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది దళపతికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.
పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో సమర్పించిన ఈ అఫిడవిట్లలో.. తనపై నమోదైన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల విషయంలో తేడాలు ఉన్నట్లు సమాచారం. పెరంబూర్ అఫిడవిట్లో.. తనపై ఎలాంటి పెండింగ్ క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు.
అయితే మూడు రోజుల తర్వాత తిరుచిరాపల్లిలో సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తనపై రెండు ఎఫ్ఐఆర్ లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ రెండింటిలో ఒక కేసు మదురై జిల్లా కూదాకోవిల్ పోలీస్ స్టేషన్లో నమోదైందని.. మరొకటి చెన్నైలోని పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైనట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు.

కేసుల విషయంతో పాటు ఎన్నికల ఖర్చులకు సంబంధించి అఫిడవిట్లో వెల్లడించిన ఆర్థిక వివరాల్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పెరంబూర్ అఫిడవిట్లో, ఎన్నికల ఖర్చుల కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సలిగ్రామం బ్రాంచ్‌లో ఒకే ఖాతా ఉందని, అందులో రూ.1 లక్ష డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు.
కానీ తిరుచిరాపల్లి అఫిడవిట్లో, రెండు ఖాతాలను చూపించారు. పెరంబూర్ కోసం సలిగ్రామం ఖాతాను కొనసాగిస్తూ, అదనంగా తిరుచిరాపల్లి మెయిన్ బ్రాంచ్‌లో మరో ఖాతా ఉందని, అందులో రూ.90,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్లో నిజాలను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంటారు.
ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం దీనికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఇది విజయ్‌కి రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశముంది. అయితే టీవీకే పార్టీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.





