Krishna : నిరాశలో ఉన్నారా? కృష్ణుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి..!
Krishna : ధ్యానం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు, నెగిటివ్ ఆలోచనలు రమ్మన్నా రావు. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది.
Krishna
ఇప్పుడు అంతా టెక్నాలజీ పూర్తిగా పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి. కానీ మనిషికి ఉండాల్సిన ప్రశాంతత మాత్రం ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కుంగిపోవడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన పడడం, పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడటం సాధారణం అయిపోయింది.
అయితే, కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి మానసిక స్థితిలోనే ఉన్నాడట. ఆ సమయంలో రథంపై కూలబడి, చేతిలో ధనుస్సు విడిచిపెట్టి, ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు(Krishna) అందించిన బోధనలే భగవద్గీత అని పండితులు చెబుతారు. అందుకే ఆ సమయంలో కృష్ణ భగవానుడు చెప్పిన సూత్రాలు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఎవరు పాటించినా సరే ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చని అంటారు.
మొదటిగా, శ్రీకృష్ణుడు(Krishna) చెప్పిన కర్మ సిద్ధాంతం మన ఒత్తిడిని సగానికి పైగా తగ్గిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే నీ పని చేయడం వరకే నీ బాధ్యత, పని వల్ల కలిగే ఫలితం గురించి అతిగా ఆలోచించవద్దని అర్థం. ఎందుకంటే మనం చేసే పని మీద కాకుండా, దాని వల్ల కలిగే లాభం, నష్టం గురించి ఆలోచించినప్పుడు మనలో టెన్షన్ మొదలవుతుంది.
అందుకే ఫలితాన్ని దేవుడికి వదిలేసి, నువ్వు చేయాల్సిన పనిని చిత్తశుద్ధితో చేస్తే, విజయం దానంతట అదే వస్తుందని శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతలో వివరిస్తాడు. ఇది మనం అనుకున్న పని విఫలమైనప్పుడు కుంగిపోకుండా, ఏ విషయంలో అయినా గెలిచినప్పుడు విర్రవీగకుండా స్థితప్రజ్ఞుడిలా మారుస్తుంది.
రెండోది మనస్సుపై నియంత్రణ. మనిషికి వారి మనస్సే మిత్రుడు, వారి మనస్సే శత్రువు. అదుపులో లేని మనస్సు మనిషి పతనానికి దారి తీస్తుంది. దీనిని అధిగమించడానికి శ్రీ కృష్ణుడు(Krishna) ధ్యానం (Meditation)తో పాటు అభ్యాసాన్ని సూచించాడు. ప్రతిరోజూ కొద్దిసేపు మౌనంగా కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మనస్సులో గందరగోళం తొలగిపోతుంది. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు, నెగిటివ్ ఆలోచనలు రమ్మన్నా రావు. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునే పవర్ లభిస్తుంది.

మూడోది అతిని విడిచిపెట్టడం. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అస్సలు నిద్రపోకపోవడం ఇలా ఏదైనా అతి అనర్థదాయకమే. అతి చేస్తే అది మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జీవితంలో ఎప్పుడూ సమతుల్యత (Balance) పాటించాలని గీత చెబుతోంది.
అలాగే, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల వచ్చే అసూయ కూడా మన మనఃశాంతిని హరిస్తుంది. అసూయ మొదట నిన్ను చంపేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నీ సామర్థ్యం ఏంటో నీకే తెలుస్తుంది, కాబట్టి నీ యుద్ధం నీతోనే అని గ్రహించాలి.
కోపం అనేది ఎలాంటి మనిషిలో అయినా విచక్షణను చంపేస్తుంది. కాబట్టి ఆవేశం, కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అందుకే భగవద్గీత అనేది కేవలం ఒక మత గ్రంథం కాదు. అది ఒక లైఫ్ మేనేజ్మెంట్ గైడ్ అంటారు పెద్దలు. భగవద్గీతలోని ఈ సూత్రాలను జీవితంలో భాగం చేసుకుంటే, నిరాశ అనే చీకటి నుంచి వెలుగులోకి రావడం ఖాయమని చెబుతారు.
Forgiving:అతిగా క్షమిస్తున్నారా? అయితే అది మీ ఉనికికే ప్రమాదంగా మారొచ్చు





