Tamil Nadu:యువత విజయ్ వెంటేనా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తాజా సర్వే ఏం చెబుతోంది?
Tamil Nadu : ఈసారి ఎన్నికల ప్రచారంలో డీఎంకే తన సంక్షేమ పథకాల మీద, అన్నాడీఎంకే గత వైఫల్యాల మీద, టీవీకే సరికొత్త రాజకీయ మార్పు మీద చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి.
Tamil Nadu
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు నయా సమీకరణాలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే సాగుతున్న పోరులోకి ఇప్పుడు దళపతి విజయ్ తన తమిళ వెట్రి కళగం (TVK) పార్టీతో ఢీ కొట్టడానికి రెడీ అవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ నెల 23న జరగనున్న తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంది. దీంతో ప్రముఖ రాజకీయ వార పత్రిక జూనియర్ వికటన్ నిర్వహించిన ఎన్నికల తాజా సర్వే ఫలితాలు తమిళనాట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జూనియర్ వికటన్ సర్వే చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఫస్ట్ టైమ్ ఓటు వేయబోతున్న యువతలో ఎక్కువ శాతం మంది విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
గత పాలకుల విధానాలతో విసిగిపోయిన యూత్..ఇప్పుడు కొత్త మార్పు కోరుకుంటూ టీవీకే పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్ , తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ లభించే ఛాన్స్ ఉందని, సుమారు 27 నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు..తమిళనాడులో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా ఈ ఎన్నికల కోసం టీవీకే రంగంలోకి దిగడం వల్ల ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేల ఓటు బ్యాంకులు చీలిపోయే ప్రమాదముందని సర్వే హెచ్చరిస్తోంది. అయితే, ఈ ఓట్ల చీలిక వల్ల చివరకు అధికార డీఎంకేకు కొంత వరకూ కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఇప్పుడు టీవీకేకు మైనస్ పాయింట్ కాగా, డీఎంకేకు ఉన్న పక్కా వ్యూహాలు , మిత్రపక్షాల బలం డీఎంకేను రేసులో ముందుంచుతున్నాయి. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 121 సీట్ల వద్ద మెజార్టీ మార్కును దాటే అవకాశం ఉన్నా సరే, అన్నాడీఎంకే కూడా 83 సీట్లతో గట్టి సవాలునే విసురుతున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు(Tamil Nadu) వ్యాప్తంగా మొత్తం 93,600 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వే.. ఫలితాల తర్వాత హంగ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతోంది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం, కింగ్ మేకర్‌గా టీవీకే అవతరించే అవకాశం ఉంటుంది.
అయితే తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కు వ్యక్తిగతంగా మంచి రేటింగ్ ఉన్నా కూడా, సీట్ల గెలుపు విషయంలో మాత్రం టీవీకే మూడో స్థానంతోనే సరిపెట్టుకోవచ్చని జూనియర్ వికటన్ సర్వే క్లారిటీ ఇచ్చింది. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ వంటి చోట్ల విజయ్ గెలుపు ఖాయమని సర్వే తేల్చి చెప్పడం విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ప్రస్తుతానికి ఈ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈసారి ఎన్నికల ప్రచారంలో డీఎంకే తన సంక్షేమ పథకాల మీద, అన్నాడీఎంకే గత వైఫల్యాల మీద, టీవీకే సరికొత్త రాజకీయ మార్పు మీద చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు తర్వాతే తమిళ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది స్పష్టమవుతుంది.
మొత్తంగా ఈ ఎన్నికల గురించి విజయ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆయన పోటీని ఆసక్తిగా గమనిస్తున్నారు. కేవలం అధికారం కోసమే కాకుండా, తమిళనాడు పాలిటిక్స్‌లో మూడవ శక్తిగా విజయ్ ఎదుగుతారా లేదా అన్నదానికి కూడా ఈ ఎన్నికలు సమాధానం చెప్పబోతుండటమే దీనికి కారణం.
Meta Layoffs : 16 వేల మంది ఇంటికే..ఉద్యోగులకు మెటా బిగ్ షాక్





