Depression:డిప్రెషన్‌కు , శారీరక నొప్పికి సంబంధం ఉందా? అవి ఆలోచనలను ఎలా మళ్లిస్తాయి?
Depression: శరీరానికి కలిగే నొప్పి కేవలం కణజాలానికో, ఎముకలకో పరిమితం కాదు. అది మనిషి ఆలోచనా విధానాన్ని, జీవన గమనాన్ని శాసించే మెదడుపైన కూడా తీవ్రమైన దాడి చేస్తుంది
Depression
శరీరానికి కలిగే నొప్పి కేవలం కణజాలానికో, ఎముకలకో పరిమితం కాదు. అది మనిషి ఆలోచనా విధానాన్ని, జీవన గమనాన్ని శాసించే మెదడుపైన కూడా తీవ్రమైన దాడి చేస్తుంది. సాధారణంగా ఒళ్లు నొప్పులో , కీళ్ల నొప్పులో వస్తే తేలిగ్గా తీసుకుని పెయిన్ కిల్లర్లతో కాలక్షేపం చేసేస్తారు. కానీ, ఈ దీర్ఘకాలిక శారీరక వేదన మనిషి మనసును నెమ్మదిగా చీకటిలోకి నెట్టేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో కంటిన్యూగా కొనసాగే నొప్పి మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీసి, అది చివరకు డిప్రెషన్(Depression)కు దారి తీస్తుంది. అందుకే నొప్పి అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదని, అది మనిషి మెదడులోని సున్నితమైన భాగాలను మార్చేసే ఒక సంక్లిష్ట ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు.
మెదడులో హిప్పోకాంపస్ అనే ఒక అతి ముఖ్యమైన భాగం ఉంటుంది. దీని మెయిన్ బాధ్యత మనిషి జ్ఞాపకాలను భద్రపరచడం , మనిషి భావోద్వేగాలను ఒక క్రమపద్ధతిలో ఉంచడం. అయితే, ఎప్పుడైతే శరీరం దీర్ఘకాలిక నొప్పితో పోరాడుతుందో, ఆ ఎఫెక్ట్ డైరక్టుగా ఈ హిప్పోకాంపస్ మీద పడుతుంది.
ఇలా నిత్యం బాధ పడటం వల్ల ఈ భాగం పనితీరు అస్థిరంగా మారుతుంది. దీనివల్ల మనిషిలో తెలియని ఆందోళన, చిరాకు, నిరాశ వంటి లక్షణాలు మొదలవుతాయి. నొప్పి ఎక్కువవుతున్న కొద్దీ, వారి మనసు కూడా అలసిపోయి కుంగుబాటులోకి జారిపోతుంది. ఇది కేవలం మానసిక బలహీనత మాత్రమే కాదు, మనిషి మెదడులో జరుగుతున్న భౌతిక మార్పుల ఫలితం మాత్రమే అంటున్నారు వైద్యులు.
దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన మెదడు స్కాన్ పరిశోధనల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలిక నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ డిప్రెషన్ రాకపోవచ్చు, కానీ ఎందుకు కొందరికి మాత్రమే వస్తుందనే కోణంలో విశ్లేషించగా మెదడు పరిమాణానికి, నొప్పికి మధ్య ఉన్న సంబంధం బయటపడింది. ఏ వ్యక్తులకు హిప్పోకాంపస్ సైజ్ సహజంగానే కొంచెం పెద్దగా ఉండి, బలంగా పనిచేస్తుందో వారు నొప్పిని భరిస్తూ కూడా మానసికంగా స్థిరంగా ఉండగలుగుతున్నారు. అంటే వారి మెదడు ఆ వేదనను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుందని తేలింది.

అలాగే నొప్పితో పాటు డిప్రెషన్(Depression)కు గురైన వారిలో హిప్పోకాంపస్ సైజ్ కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఈ మార్పు వల్ల వారిలో కేవలం ఎమోషనల్ ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఆలోచనా శక్తి కూడా మందగిస్తుంది. విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మెదడులోని కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల మనిషి జీవితంపై ఆసక్తిని కోల్పోతాడు.
అందుకే శారీరక నొప్పిని ఎప్పుడూ కూడా కేవలం శరీరానికి సంబంధించినదిగా చూడకుండా, అది మనిషి మానసిక ఆరోగ్యానికి సంకేతంగా భావించాలి. దీర్ఘకాలిక నొప్పులను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోకపోతే, అది మనిషి మెదడు నిర్మాణాన్ని మార్చేసి మనుషుల్ని తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకువెళ్తుంది. ఆరోగ్యకరమైన మెదడు కావాలంటే, నిరంతర నొప్పి నుంచి ఉపశమనం పొందడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.





