Lucknow Super Giants : లక్నో గెలుపు బాట పట్టేనా ?..బెంగళూరుతో కీలక మ్యాచ్
Lucknow Super Gaints : ఐపీఎల్ 19వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
Lucknow Super Giants
ఐపీఎల్ 19వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) వరుస పరాజయాలతో సతమతమవుతోంది. వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు దాదాపుగా దూరమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న లక్నో మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. ఈ సీజన్ లో బ్యాటింగ్ వైఫల్యమే లక్నో పేలవ ప్రదర్శనకు కారణంగా చెప్పొచ్చు.
మార్ష్ , మార్క్ రమ్, పంత్, నికోలస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లున్నా నిలకడగా రాణించడం లేదు. కెప్టెన్ పంత్ అయితే ఈ సీజన్ లో చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. అటు సారథిగానూ నిరాశ పరుస్తున్నాడు. కొన్ని మ్యాచ్ లలో బ్యాటింగ్ పరంగా చేసిన ప్రయోగాలు కూడా లక్నో కొంపముంచాయి.
ఈ నేపథ్యంలో బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో మళ్లీ గెలుపు బాట పట్టే అవకాశం లేదు. బౌలింగ్ లో మహ్మద్ షమీ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్నాడు. అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ పేస్ త్రయం కూడా ఆకట్టుకుంటోంది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండడం లక్నోకు అడ్వాంటేజ్. అటు స్పిన్ విభాగంలో దిగ్వేశ్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకుంటున్నారు.
ఆయుశ్ బదోనీ కూడా స్పిన్నర్ గా రాణిస్తున్నాడు. అయినా సరే లక్నోకు విజయాలు అందడం లేదు. ఇప్పుడు ఆర్సీబీపై పూర్తిస్థాయిలో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప లక్నో పరాజయాలకు బ్రేక్ పడడం కష్టమే.
మరోవైపు గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ షాకిచ్చింది. ఆ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఓటమి రుచి చూపించింది. ఈ మ్యాచ్ తర్వాత దాదాపు వారం రోజులు రిలాక్స్ అయిన ఆర్సీబీ లక్నోను ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ఫిల్ సాల్ట్ దూరమవడం బెంగళూరుకు మైనస్ పాయింట్.

అయితే కోహ్లీ, పడిక్కల్, పటిదార్ ఫామ్ లో ఉండడంతో ఆర్సీబీ బ్యాటింగ్ బలంగానే ఉంది. జాకబ్ బెథల్ తో పాటు జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా కూడా చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే హ్యాజిల్ వుడ్ సైతం అదరగొడుతున్నాడు.
స్పిన్ విభాగంలో సుయాశ్ శర్మ, కృనాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టింగా ఉన్న ఆర్సీబీని ఓడించడం లక్నోకు అంత సులభం కాదు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఏడుసార్లు తలపడితే ఐదు మ్యాచ్ లలో ఆర్సీబీనే గెలిచింది.
Gond Kathira :గోంద్ కతీరా పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ సమ్మర్లో అస్సలు లైట్ తీసుకోకండి..





