Mother :ప్రతీ ఇంట్లో ఉండే దైవం అమ్మ.. మది నిండా అమ్మ జ్ఞాపకాలను నెమరువేసుకోండి..
Mother : తొమ్మిది నెలలు మనల్ని తన కడుపులో మోసి, తన రక్తాన్ని పాలగా ఇచ్చి పెంచిన ఆ తల్లి త్యాగానికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.
Mother
సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ అనే రెండక్షరాల నిధి మాత్రమే. ఈరోజు, మే 10, 2026 మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తి గొప్పతనాన్ని స్మరించుకుంటూ, తల్లి నిస్వార్థ ప్రేమను మనసు నిండా అనుభూతి చెందుదాం.
భారతీయ సంస్కృతిలో భాగంగా తల్లి(Mother)ని కేవలం మనిషిగా కాకుండా, దైవంగా భావిస్తుంటాం. సృష్టిలోని అనంతమైన శక్తిని కూడా మాతృత్వంతోనే పోలుస్తాం. చివరకు ఈ గడ్డను భరత మాత అని, మనమంతా నివసించే నేలను భూమాత అంటూ ఎంతో గౌరవంగా పిలుచుకుంటాం. చివరకు మోడర్న్ టెక్నాలజీలో కూడా అత్యంత కీలకమైన భాగాన్ని మదర్ బోర్డ్ అని పిలవడం మాతృత్వానికి ఉన్న ఇంపార్టెన్స్‌ను చెప్పకనే చెబుతుంది.
అమ్మ(Mother) ప్రేమకు, అభిమానానికి హద్దులు, షరతులు ఉండవు. మనం ఏ హోదాలో ఉన్నా, ప్రపంచానికి ఎంతటి మేధావి అయినా సరే అమ్మ ముందు మాత్రం ఎప్పటికీ పసిపిల్లలమే. తండ్రి పౌరుషం ఇస్తే, తోడబుట్టినవారు ధైర్యం ఇస్తారు కానీ వీటన్నిటికంటే అతీతమైనది, చివరి వరకూ నీకు అన్నివిధాలా నీడలా నిలిచేది మాత్రం తల్లి ప్రేమ మాత్రమే.
అంతెందుకు ఫేమస్ కవి దులా భాయా కాగ్ చెప్పినట్లు..అమ్మ(Mother) అని పిలిచిన ప్రతిసారి ఎలాంటి మనిషిలో అయినా అహంకారం కరిగిపోతుంది . మనసు ఎంత పరిణితి చెందినా, అమ్మ దగ్గర ఉన్నప్పుడు కలిగే ఆ ప్రశాంతత ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు.
అమ్మ అంటే కేవలం మనకు జన్మనిచ్చింది మాత్రమే కాదు..తనే మన మొదటి గురువు, మొదటి స్నేహితురాలు కూడా. తొమ్మిది నెలలు మనల్ని తన కడుపులో మోసి, తన రక్తాన్ని పాలగా ఇచ్చి పెంచిన ఆ తల్లి త్యాగానికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.

అమ్మ మనల్ని ఎదిగేవరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, అదే అమ్మ వయసు మళ్లినప్పుడు, శరీరం సహకరించని స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు మనమిచ్చే చేయూతే అత్యవసరం. ముసలితనంలో వారు కోరుకునేది కాస్తంత కేరింగ్ ,కొంచెం ప్రేమ, మరికొంత సమయం మాత్రమే. ఏ తల్లి, తండ్రి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన బిడ్డలను భారంగా అనుకోరు. ఈ విషయాన్నే ఆ తల్లి పెద్దయ్యాక మనం గుర్తు పెట్టుకోవాలి.
ఈ మదర్స్ డే రోజున మన చిన్నప్పుడు తల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని..ఆమెను గౌరవిద్దాం. దేవుడు ప్రతి చోటా ఉండలేకే అమ్మను సృష్టించాడని అంటారు. అందుకే అమ్మను చివరి శ్వాస వరకు కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలి.





