HealthLatest News

Urinary Tract Infection:ముప్పుగా మారుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్..మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తుంది?

Urinary Tract Infection: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు బాడీ కొన్ని సంకేతాలను ఇస్తుంది.

Urinary Tract Infection

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI). ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో అంటే కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీని గురించి పూర్తి అవగాహన ఉంటే ప్రాథమిక దశలోనే నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా ఈ-కోలి (E.coli) అనే బ్యాక్టీరియా మూత్రనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. నీళ్లు తక్కువగా తాగడం, మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొని కూర్చోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెబుతారు. డయాబెటిస్ ఉన్నవారిలో, గర్భిణీలలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే, పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

మహిళల్లో మూత్రనాళం (Urethra) మగవారి కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా ఈజీగా మూత్రాశయానికి చేరుకుంటుంది. అలాగే స్త్రీలలో మలద్వారానికి మూత్రనాళం దగ్గరగా ఉండటం వల్ల అక్కడ ఉండే ఈ-కోలి బ్యాక్టీరియా త్వరగా మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు గర్భధారణ సమయంలో కలిగే శారీరక మార్పులతో పాటు మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వంటి కారణాల వల్ల స్త్రీలలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (Urinary Tract Infection)సోకినప్పుడు బాడీ కొన్ని సంకేతాలను ఇస్తుంది. మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట కానీ నొప్పి కానీ కలిగితే అనుమానించాలి. అలాగే పదే పదే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. కానీ వెళ్లినప్పుడు తక్కువ పరిమాణంలో యూరిన్ రావడం జరుగుతుంది. మూత్రం రంగు మారి ముదురు రంగులో రావడం, దుర్వాసనతో కూడి ఉంటుంది. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వణుకు ఒక్కోసారి వాంతులు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఈ సమస్య నుంచి బయటపడటానికి పుష్కలంగా నీరు తాగడమే బెస్ట్ మెడిసిన్. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు కొట్టుకొనిపోతుంది. వాష్‌రూమ్‌కు వెళ్లిన ప్రతిసారి కూడా శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు క్లీన్ చేసుకునేటపుడు ముందు నుంచి వెనుకకు క్లీన్ చేయాలి. లేదంటే మలద్వారం వద్ద ఉండే ఈ-కోలి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. శృంగారానికి ముందు , తర్వాత శుభ్రత పాటించడం, కాటన్ లోదుస్తులు ధరించడం వంటివి ఇన్ఫెక్షన్ దగ్గరకు రాకుండా చేస్తాయి.

Urinary Tract Infection
Urinary Tract Infection

ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించగానే డాక్టరును సంప్రదించి.. వారు ఇచ్చే యాంటీబయోటిక్ కోర్సును మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి. ఆహారంలో సి-విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, నిమ్మరసం, పెరుగు ,క్రాన్ బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు. కాఫీ, టీ , మసాలా వస్తువులకు కొద్ది రోజులు దూరంగా ఉండటం వల్ల మూత్రాశయంపై ప్రెషర్ తగ్గుతుంది.

యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(Urinary Tract Infection) అనేది సరైన సమయంలో ట్రీట్మెంట్‌ తీసుకుంటే త్వరగా తగ్గిపోయే సమస్యే. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లు , పరిశుభ్రతతో ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు.

Self Talk : ఆత్మవిమర్శ అనే అడ్డంకి మిమ్మల్నీ అడ్డుకుంటుందా?..నెగటివ్ సెల్ఫ్ టాక్ ఎందుకు?

Related Articles

Back to top button